తెలియకుండానే ‘కొలెస్ట్రాల్‌’ పెంచేస్తాయి.. ఈ అలవాట్లు మానుకోండి!

కొవ్వు (Cholesterol) అనగానే.. చాలామందికి అది శరీరానికి చేటు చేసే పదార్థమనే భావన కలుగుతుంది. ముఖ్యంగా గుండెకు హాని చేస్తుందేమోనని భయపడుతుంటారు.


అయితే.. కొవ్వుల్లోనూ మనకు మంచి చేసేవి (హెచ్‌డీఎల్‌), చెడు చేసేవి (ఎల్‌డీఎల్‌) ఉన్నాయి. శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు పెరిగి, హెచ్‌డీఎల్‌ తగ్గిపోయినప్పుడు.. గుండె జబ్బులు, స్ట్రోక్‌ ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే.. ఈ సమస్య ఒక్కరోజులో వచ్చేది కాదని నిపుణులు చెబుతున్నారు. మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు దీన్ని పెంచి పోషిస్తుంటాయని పేర్కొంటున్నారు. అయితే, కొవ్వు స్థాయిలను దెబ్బతీసే ఆ అలవాట్లేంటో, వాటికి పరిష్కార మార్గాలేంటో చూద్దాం..!

దీర్ఘకాలిక ఒత్తిడి..

ఉరుకుల పరుగుల జీవితం, జీవనశైలిలో మార్పులతో నేటి సమాజంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇదికాస్త అతిగా తినడం, శారీరక శ్రమపై ఆసక్తి చూపకపోవడం వంటివాటికి కారణమవుతోంది. అదేపనిగా ఒత్తిడి.. కాలేయం ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్‌ ఉత్పత్తి చేయడానికి దారితీస్తుంది. దీంతో కాలక్రమేణా సమస్య మరింతగా ముదిరే ప్రమాదం ఉంది. శ్వాస సంబంధిత వ్యాయామాలు, యోగా, నడక వంటి మార్గాలతో ఒత్తిడిని అదుపు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సరిపడా నిద్ర లేకపోవడం..

నిద్ర అనేది కేవలం విశ్రాంతి కోసమే కాదు. హార్మోన్ల సమతుల్యత, జీవక్రియ సజావుగా సాగడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించే శరీర సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. నిద్రలేమితో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఫలితంగా ఎల్‌డీఎల్‌ పెరుగుతుంది. కాబట్టి.. ప్రతి మనిషికీ రోజుకు కనీసం 7-9 గంటల నిద్ర అవసరం. దీనికోసం క్రమబద్ధమైన ఒక దినచర్యను అలవాటు చేసుకోవాలి.

రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్లు..

చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చిరుతిళ్లు, వైట్‌ బ్రెడ్‌ వంటి రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్‌ పదార్థాలు శరీరానికి చేటు చేసేవే. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి ఇవి కారణం కావచ్చు. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్‌, ట్రైగ్లిజరైడ్ల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. మంచి కొలెస్ట్రాల్‌ను ఇవి తగ్గిస్తాయి. పాలిష్‌ పట్టని గింజధాన్యాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ఆహార పదార్థాలు మేలు చేస్తాయి.

గంటలతరబడి కూర్చొని ఉండటం..

చదువులు.. ఉద్యోగం.. ఇతరత్రా వ్యాపకాలతో కొంతమంది ఎక్కువ సమయం పాటు కుర్చీలకు అతుక్కుపోతుంటారు. ఎటువంటి విరామం లేకుండా గంటలతరబడి ఒకేచోట కూర్చోవడం.. మన శరీరంపై దుష్ప్రభావం చూపుతుంది. దీనివల్ల హెచ్‌డీఎల్‌ స్థాయిలు తగ్గే ప్రమాదం ఉంది. రక్తంలో కొవ్వు పదార్థాల జీవక్రియ (ఫ్యాట్‌ మెటబాలిజం) నెమ్మదిస్తుంది. నిర్ణీత సమయానికోసారి కూర్చున్న చోటునుంచి లేవడం, అటూ ఇటూ తిరగడం, శరీరాన్ని వంచడం వంటివి చేస్తుండాలి.

మితిమీరిన చిరుతిళ్లు..

కాలక్షేపం కోసమో లేదా ఒత్తిడి కారణంగానో కొంతమంది చిరుతిళ్లు ఎక్కువగా లాగిస్తుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్‌ అధిక బరువుకు కారణమవుతుంది. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఎల్‌డీఎల్‌ను పెంచుతాయి. హెచ్‌డీఎల్‌ స్థాయిలను దెబ్బతీస్తాయి. పీచు ఎక్కువగా ఉండే పండ్లు, ఉడికించిన శెనగలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తీసుకోవాలని, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా.. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తినాలని నిపుణుల సూచన.

వ్యాయామ లేమి..

శరీర బరువు పెరుగుతున్నకొద్దీ కొలెస్ట్రాల్‌ స్థాయిలూ పెరిగే ప్రమాదముంది. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం ముప్పు ఎక్కువవుతాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం.. ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవటం ఎంతైనా అవసరం. దీంతో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గటంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అయితే.. ఏదైనా ఒక డైట్‌ని, వ్యాయామాన్ని పాటించే ముందు నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.