Chandrababu: అయ్యన్న ఇప్పటికీ ఫైర్‌ బ్రాండే: చంద్రబాబు

www.mannamweb.com


అమరావతి: అసెంబ్లీలో అత్యంత సీనియర్‌ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. స్పీకర్‌గా అయ్యన్న ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడారు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమన్నారు. ఎన్టీఆర్‌ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఏ పదవి ఇచ్చినా వన్నె తెచ్చారని పేర్కొన్నారు.

‘‘66 ఏళ్ల వయసు ఉన్నా అయ్యన్న ఇప్పటికీ ఫైర్‌ బ్రాండే. నీతి, నిజాయతీ, నిబద్ధతను పుణికి పుచ్చుకొని రాజకీయాలు చేశారు. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయనపై అనేక పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టి వేధించారు. 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు. ఆయన చట్టసభకు రావడం అరుదైన గౌరవం. మనందరిపై పవిత్ర బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలి. సమర్థంగా పనిచేస్తే గౌరవం దానంతట అదే వస్తుంది.

ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసింది. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారు. మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే గట్టిగా చెప్పా. కౌరవ సభకు రాను.. గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశా. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారు. సోషల్‌మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టారు. ప్రజలు అంతా గమనించి నన్ను గౌరవసభకు పంపారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలి. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలి. తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలనేదే నా కోరిక’’

ఎక్కడ తగ్గాలో .. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్
‘‘ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్‌ అని హేళన చేశారు. నేడు కూటమికి 164 సీట్లు వచ్చాయి.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్‌. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారు. పోటీ చేసిన 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన వ్యక్తి పవన్‌. ఎక్కడ తగ్గాలో .. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్‌. వైకాపా వైనాట్‌ 175 అని చెప్పి 11 సీట్లు తెచ్చుకున్న పరిస్థితిని చూశాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసన సభ. 15వ శాసనసభను కౌరవసభగా మనం భావించాం. అత్యున్నత, గౌరవప్రదమైన సభగా 16వ సభను తీర్చిదిద్దాలి’’ అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు..: పవన్‌

‘‘సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషం. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడివేడి చూశారు. ఇన్నాళ్లూ ప్రజలు మీ వాగ్దాటి చూశారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసింది. భాష మనసులను కలపడానికే.. విడగొట్టడానికి కాదు. ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడలేదు..

‘‘ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న. ఏడుసార్లు ఎమ్మెల్యేగా మీకు చాలా అనుభవం ఉంది. మీ నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయి. నాకు ఎప్పుడూ సలహా కావాలన్నా మీతో సంప్రదించా. ఒకే పార్టీ.. ప్రజలే అజెండాగా ముందుకెళ్లిన వ్యక్తి అయ్యన్న. అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా ఆయన భయపడలేదు’’ అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.