తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.
రేవంత్ మంత్రివర్గం లో ప్రస్తుతం మూడు ఖాళీలు ఉన్నాయి. మైనార్టీకి మంత్రి పదవి లేకపోవటంతో అజారుద్దీన్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా.. అజారుద్దీన్ కు శాఖ ఖరారైనట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఖాయమని తెలుస్తోంది.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ రేపు(శనివారం) జరగనుంది. రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకరం చేయనున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో మూడు ఖాళీలు ఉన్నాయి. అజారుద్దీన్ చేరిక ఖాయం కావటంతో.. మిగిలిన రెండు స్థానాల పైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ రెండు ఎస్సీ, ఒక బీసీ వర్గానికి అవకాశం దక్కింది. ఇప్పుడు మైనార్టీకి ఛాన్స్ ఇస్తున్నారు. దీంతో.. మిగిలిన రెండు పదవుల భర్తీ పైన రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడే ఆ ఇద్దరికీ ఛాన్స్ ఇవ్వటం కంటే.. జూబ్లీ హిల్స్ బై పోల్ తరువాత మరోసారి విస్తరణలో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా పార్టీ నేతల సమాచారం.
ఇక.. అజారుద్దీన్ కు మైనార్టీ సంక్షేమంతో పాటుగా క్రీడల శాఖ ఇవ్వనున్నట్లు తొలుత పార్టీ నేతలు వెల్లడించారు. అయితే.. తాజాగా హోం శాఖ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం హోం శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉంది. ఇతర మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయి పదవుల భర్తీ పైన నిర్ణయం జరిగింది. ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒకరి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆరు గ్యారంటీల అమలుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాజీ మంత్రి, ఓ సీనియర్ ఎమ్మెల్యేను నియమించే అవకాశముందని చెబుతున్నారు. ఇక.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారటంతో. ఈ ఉప ఎన్నిక తరువాత నియామకాలు.. మార్పుల పైన నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పైనే రేవంత్ ఫోకస్ చేసారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతున్నట్లు సర్వే రిపోర్టులు రావడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ ఎంపిక విషయంలో ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బంది తలెత్తితే వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీల్లో ఇతర కోటా కింద ఎంపిక చేసేందుకు అవకాశం ఉందని అంచనా వేసిన ఏఐసీసీ ఆ నిర్ణయం తీసుకుంది. మైనారిటీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి వస్తుందని అధిష్ఠానం భావిస్తోంది. దీంతో.. ఇప్పుడు అజార్ కు మంత్రి పదవి.. పదవులు.. శాఖల మార్పు పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.

































