ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి సంక్షోభం దిశగా పయనిస్తోందా అనే ప్రశ్న మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, అస్థిర చమురు ధరలు, సాంకేతిక రంగంలో భారీగా ఉద్యోగాల తొలగింపులు, ప్రపంచ మార్కెట్లలోని అనిశ్చితి వాతావరణం..
ఇవన్నీ 2026లో మాంద్య సంకేతాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఆర్థికవేత్తలకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వాంగా చేసిన ఒక ప్రవచనం కూడా ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైంది.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. బాబా వాంగా 2026లో ప్రపంచ వ్యాప్తంగా క్యాష్ క్రష్ లేదా నగదు కొరత చోటుచేసుకుంటుందని ముందుగానే చెప్పారని కథనం వెలువరించింది. ఈ కథనం ప్రకారం.. ఆర్థిక వ్యవస్థలు ఒక దశలో వర్చువల్ కరెన్సీలు (డిజిటల్ మనీ), సంప్రదాయ నగదు (హార్డ్ క్యాష్) రెండూ విఫలమయ్యే స్థితికి చేరవచ్చని బాబా వంగా తెలిపినట్లగా పేర్కొంది.దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థల్లో అంతరాయాలు, కరెన్సీ విలువలు క్షీణించడం, మార్కెట్లో ద్రవ్యత తగ్గిపోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చని ఆమె అంచనా వేసినట్లు లాడ్‌బైబుల్ నివేదిక తెలిపింది.
ఈ Cash Crush భావన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ప్రజలు 2026లో నిజంగానే ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?.. డబ్బు విలువ పూర్తిగా తగ్గిపోతుందా? అనే ప్రశ్నలు వేస్తున్నారు. బాబా వాంగా చేసిన ఈ అంచనాలు 2008 లాంటి లేదా అంతకంటే తీవ్రమైన మాంద్యం వచ్చే అవకాశాన్ని సూచిస్తున్నాయని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం ఇది ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు.. బాబా వాంగా ప్రవచనాల ప్రకారం 2026లో ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం కూడా ఉందని చెబుతారు. ఆమె మూడవ ప్రపంచ యుద్ధం ప్రధాన ప్రపంచ శక్తుల మధ్య.. ముఖ్యంగా రష్యా, అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రారంభమవవచ్చని పేర్కొన్నారని మనీకంట్రోల్ నివేదిక తెలిపింది. చైనా తైవాన్‌పై ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం, పశ్చిమ దేశాల మధ్య ఉన్న ఆర్థిక-సైనిక ఉద్రిక్తతలు ఈ ప్రవచనానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఇక బాబా వాంగా మరో ముఖ్యమైన ప్రవచనం కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా ఉంది. ఆమె ప్రకారం 2026 నాటికి AI మానవ వ్యవస్థలపై గణనీయమైన నియంత్రణను సాధిస్తుందని, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఇది ఒకవైపు మానవ జీవితాన్ని సులభతరం చేయగలిగినా, మరోవైపు ఆర్థిక అసమానతలను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆమె చేసిన మరో ఆసక్తికర జోస్యం గ్రహాంతర జీవుల గురించి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. బాబా వాంగా నవంబర్ 2026లో ఒక భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నట్లు చెబుతున్నారు. నవంబర్ 2026 లో గ్రహాంతర జీవులతో సంపర్కం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంచనాలు హార్వర్డ్ శాస్త్రవేత్త అవి లోబ్ చేసిన పరిశోధనలతో కొంత సమాంతరంగా ఉన్నాయని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు బాబా వాంగా చేసిన అనేక ప్రవచనాలు నిజమయ్యాయి. సెప్టెంబర్ 11 దాడులు, బ్రెగ్జిట్, 2004 సునామీ వంటి ఘటనల గురించి చేసిన అంచనాలు కొంతవరకు నిజమయ్యాయని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే నిపుణులు ఈ ప్రవచనాలను శాస్త్రీయ ఆధారాలతో కాకుండా, ప్రతీకాత్మకంగా చూడాలని సూచిస్తున్నారు. ఏదేమైనా క్యాష్ క్రష్ అనే బాబా వాంగా 2026 ప్రవచనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న అస్థిరతను ప్రతిబింబిస్తోంది. ఇది నిజమవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.



































