జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

www.mannamweb.com


జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక విషయాలు వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా రుషికొండ భవనాల లోపల విషయాలను బహిర్గతం చేసిన కూటమి ప్రభుత్వం…

జగన్ ఆఫీసు, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ప్రభుత్వానిది అనే విషయాన్ని తెరపైకి తెచ్చి.. నాటి కోడెల శివప్రసాద్ ఇష్యూని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఫర్నిచర్ పై బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును… తాజాగా ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని అన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా, అన్యాయంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం సభలో ఉన్న 80% మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయని తెలిపారు.

ఇందులో భాగంగా… అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ, రఘురామరాజు… ఇలా ఏ నేతనీ వదలలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ రాజు అయితే ఐదేళ్ల పాటు తన నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆయన గుర్తుచేశారు. ఇవన్నీ తలచుకుంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఫర్చిచర్ టాపిక్ ఎత్తారు.

ఈ సందర్భంగా… నాడు ఫర్నిచర్ ని సాకుగా చూపించి కోడెల శివప్రసాద్ పై ఫేక్ వార్తలు రాశారని చెప్పిన చంద్రబాబు.. ఆయన్ను తీవ్రంగా అవమానించి, వేధించి, బలవంతంగా చనిపోయే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. ఇదే సమయంలో… అసలు ఫర్నిచర్ అనేది చిన్న అంశం అని.. దానికి డబ్బులు వెలకట్టి తీసుకుంటే సరిపోయేదానికి కేసులతో నాడు కోడెలను వేధించారని అన్నారు.

ఈ క్రమంలోనే… “ఇప్పుడు జగన్ రెడ్డిని అడుగుతున్నా.. ఇప్పటికీ నువ్వు ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు.. నీ సంగతి ఏంటి అని అడుగుతున్నా” అంటూ చంద్రబాబు.. జగన్ ని ప్రశ్నించారు. మరోపక్క ఈ ఆరోపణలపై వైసీపీ ఆన్ లైన్ వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా… నిబంధనల ప్రకారం ఫర్నిచర్ కి విలువకట్టి తీసుకుంటామని జూలై 1న లేఖ రాసినట్లు పేర్కొంది.