ఆఫ్ఘాన్‌పై గెలుపుతో జోష్‌లో ఉన్న భారత్‌కు బ్యాడ్ న్యూస్.. ఇదేం కర్మరా బాబు!
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ హవా నడుస్తోంది. ఇప్పటిదాకా ఓటమి అనేదే లేకుండా బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకెళ్తోంది టీమిండియా. లీగ్ స్టేజ్‌లో హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టిన రోహిత్ సేన..
సూపర్-8ను కూడా సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన సూపర్ పోరులో 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. కరీబియన్ పిచెస్పై ఎలా ఆడుతుందో అనే అనుమానాల మధ్య బరిలోకి దిగిన భారత్.. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో దుమ్మురేపింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32), విరాట్ కోహ్లీ (24) బ్యాట్లతో చెలరేగారు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చెరో 3 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచారు.
భారతబౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా ఫామ్‌లోకి రావడం, డేంజరస్ టీమ్‌ను చిత్తుగా ఓడించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇలా ఆడితే ఏ టీమ్ కూడా మనల్ని ఆపలేదని, కప్ టీమిండియాదేనని ఫ్యాన్స్ అంటున్నారు. తదుపరి మ్యాచుల్లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను కూడా రోహిత్ సేన చిత్తుగా ఓడించడం ఖాయమని చెబుతున్నారు. ఈ తరుణంలో భారత అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ఆఫ్ఘాన్‌ను మట్టికరిపించిన మెన్ ఇన్ బ్లూ.. సూపర్-8లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాను ఢీకొట్టనుంది. అంటిగ్వా వేదికగా జూన్ 22న ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో నెగ్గి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది.
బంగ్లాదేశ్ కూడా మన జట్టుకు షాక్ ఇచ్చి నాకౌట్ ఛాన్సుల్ని సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్-బంగ్లా మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న అంటిగ్వాలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. అంటిగ్వాలో వాన పడేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయని వెదర్ వెబ్‌సైట్స్ అంటున్నాయి. మ్యాచ్ జరిగే రోజు ఉదయం నుంచే తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. అక్కడి కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ పొద్దున 10.30 గంటలకు మొదలవనుంది. దీంతో మ్యాచ్ జరిగే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్-బంగ్లా మ్యాచ్ రద్దయితే ఇరు టీమ్స్‌కు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఇదేం కర్మరా బాబు అంటున్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ ఈజీగా నెగ్గుతుందని, సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించొద్దని కోరుకుంటున్నారు.