ఏడాదిన్నర సస్పెన్స్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. ప్రముఖ రెజ్లర్, నటుడు జాన్ సీనా(48) తన రెజ్లింగ్ ప్రొఫెషనల్‌కు ముగింపు పలకబోతున్నారు.
తన చివరి మ్యాచ్ ఎప్పుడనేదానిపైనా ఆయనే స్వయంగా స్పష్టత ఇచ్చారు. అయితే ప్రత్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ ఉంచారు. దీంతో ఆ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని చెబుతూనే మరోపక్క అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
రెజ్లింగ్ పరంగానే కాదు.. సినిమాలతోనూ జాన్ సీనా(John Cena) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి ఫ్యాన్స్‌కు ఆయన చేదు వార్త చెప్పారు. డిసెంబర్ 13వ తేదీన తన చివరి మ్యాచ్‌తో రెజ్లింగ్‌కు వీడ్కోలు పలకబోతున్నట్లు తెలిపారాయన. కిందటి ఏడాది జూన్‌లో ఆయన ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ, అప్పటి నుంచి కూడా ఆయన డబ్ల్యూడబ్ల్యూఈలో మ్యాచ్‌లు ఆడుతూ వస్తున్నారు.
ఈ క్రమంలో మునుపటిలా ఆయన ప్రేక్షకులను అలరించలేకపోతున్నారనే విమర్శ వినిపిస్తూ వచ్చింది. అయితే.. 23 ఏళ్లుగా ‘ది చాంప్ ఈజ్ హియర్, యూ కాంట్ టు సీ మీ’ అంటూ హీరోగా చెలామణి అవుతూ వస్తున్న జాన్ సీనా.. ఈ ఏడాది ‘హీల్’ స్క్రిఫ్ట్‌తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారిపోయారు. చాంపియన్ అయిన కోడీ రోడ్స్‌ను ది రాక్ సమక్షంలో దాడి చేసి నెగెటివ్ షేడ్స్‌తో జాన్ సీనా తన క్రేజ్‌ను మళ్లీ పెంచుకున్నారు. ఆ వెంటనే మరో లెజెండ్ రాండీ ఓర్టాన్‌తోనూ ఆయన మ్యాచ్ ఆడి నెగ్గారు.
తాజాగా మరో దిగ్గజ రెజ్లర్ ఏజే స్టయిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జాన్ సీనా గెలిచాడు. అయితే.. అందులో ఇద్దరూ పలువురు రెజ్లింగ్ దిగ్గజాల ఫైనల్ మూవ్స్‌తో ఆకట్టుకోవడం.. ఈ ఏడాదికి బెస్ట్ మ్యాచ్‌ను అందించారనే అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం చేసింది. అభిమానులు ఆ ఆనందంలో ఉండగానే.. జాన్ సీనా తన చివరి మ్యాచ్ తేదీని ప్రకటించారు(John Cena Last Match). అయితే ఆ మ్యాచ్ ఎవరితో అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. మరోవైపు.. ఈ రెజ్లర్ లెజెండ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని డబ్ల్యూడబ్ల్యూఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
రెజ్లింగ్ రింగ్ నుంచి హాలీవుడ్ దాకా..
జాన్ సీనా పూర్తి పేరు జాన్ ఫెలిక్స్ ఆంటోనీ సీనా. 1977లో మసాచుసెట్స్‌లో ఆయన జన్మించారు. 1999లో ర్యాపర్ నుంచి రెజ్లింగ్ వైపునకు మళ్లారు. 2002లో డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టి.. ప్రారంభంలోనే కర్ట్ యాంగిల్, అండర్‌టేకర్, బ్రాక్ లెస్నర్‌లాంటి స్టార్స్‌తో తలపడ్డాడు. 2004 రెజ్లింగ్ మేనియా-20 ఈవెంట్‌లో బిగ్ షోతో యూఎస్ చాంపియన్ టైటిల్ కోసం జరిగిన మ్యాచ్.. జాన్ సీనా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ మరుసటి ఏడాది.. అదే ఈవెంట్‌లో జేబీఎల్(బ్రాడ్‌షా)తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి చాంపియన్ టైటిల్ గెల్చుకున్నారు. అలా.. తక్కువ సమయంలోనే అభిమానుల మనసు గెలుచుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈలో 17 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఆయన.. స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్, ది రాక్, అండర్ టేకర్ వంటి దిగ్గజాలతో సమానంగా గుర్తింపు పొందాడు. రెజ్లింగ్‌లో ఫేమ్ కొనసాగుతుండగానే..
జాన్ సీనా 2006లో ది మెరైన్ (The Marine) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. తర్వాత ట్రెయిన్‌వ్రెక్, బంబ్లేబీ, ఫాస్ట్ అండ్ ప్యూరియస్ 9, ది సూసైడ్ స్క్వాడ్, పేస్‌మేకర్(హెచ్‌బీవో సిరీస్) నటించి సక్సెస్‌లు అందుకున్నారు. హాస్యం, యాక్షన్, భావోద్వేగం.. సమపాళ్లలో ఉన్న నటుడిగా గుర్తింపు పొందాడు.
జాన్ సీనా వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుకుంటారు. ఆయనకు రెండు సార్లు వివాహం అయ్యింది. 2009లో ఎలిజబెత్ హుబెర్‌డ్యూని వివాహమాడి మూడేళ్లకే విడాకులిచ్చారు. ఆపై 2012 నుంచి ఆరేళ్ల పాటు తోటి రెజ్లర్ నిక్కీ బెల్లాతో డేటింగ్ వ్యవహారం నడిపించారు. 2018లో షే షరియత్జాదెహ్ అనే ఇరానీయన్ కెనెడియన్‌ను వివాహమాడారు. ఈ జంట పిల్లలు వద్దని నిర్ణయించుకుంది.
ఇదిలా ఉంటే.. రెజ్లింగ్, సినిమా పారితోషకంతో ఆయన ఆస్తుల విలువ(తాజా సమాచారం) సుమారు 80-85 మిలియన్ డాలర్లు(రూ.750 కోట్ల దాకా) ఉంటుందనేది అంచనా. అంతేకాదు.. పలు ప్రముఖ బ్రాండ్‌ల ఎండోర్స్‌మెంట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతోనూ ఆయన గణనీయంగా సంపాదించుకుంటున్నారు. ఆయనకు ఫ్లోరిడాలో విలాసవంతమైన మాన్షన్ ఉంది(John Cena Wife Children Assets Details).
రెజ్లింగ్ చాంపియన్‌గా, సినీ తారగానే కాదు.. జాన్ సీనా మంచి వ్యక్తిగానూ గుర్తింపు దక్కించుకున్నాడు. మేక్ ఏ విష్ Make-A-Wish Foundation ద్వారా 650 మందిని కలిసి.. వాళ్ల చిన్ని చిన్ని కోరికలు తీర్చాడు. తద్వారా గిన్నిస్ రికార్డు సాధించారు కూడా.
































