కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారక రామారావు తెలుగువాడి వాడి వేడి ప్రపంచానికి చూపించారు. ఆయన గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లో చదువుకున్నారు.
ఆ కాలేజ్ లో చదువుకుంటూ గుంటూరులోని కన్నావారి తోటలోని ఓ ఇంటి రూంలో నివసించేవారు. అప్పటి రోజుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లి రూంలో ఉంటూ చదువుకోవడం అంటే గొప్పే..! అలా ఎన్టీఆర్ ఏసీ కాలేజ్ చదువుతూ కన్నావారి తోట రెండో లైన్‌లో ఉన్న ఇంటిలోని రూంలో ఉండేవారు. ఇప్పటికీ ఆ ఇల్లు అలానే ఉంది.
1940లో ఎన్టీఆర్.. ఏసీ కాలేజ్‌లో బిఏ చదివారు. అప్పుడు కన్నా వారి తోటలో ఉన్న ఒక ఇంటిలో పైన ఉన్న ఒక చిన్న గదిలో నివసించేవారు. ఆ ఇంటి నుండి కాలేజ్ కు ప్రతి రోజూ నడిచి వెళ్లి వచ్చేవారని స్థానికులు తెలిపారు. ఎన్టీఆర్ తో పాటు మరో సినీ నటుడు ముక్కామల కూడా ఎన్టీఆర్ తో పాటు ఆ గదిలోనే ఉండేవారట… ఎన్టీఆర్ ఆ రూం బయట ప్రాంగంణలో స్నానం చేసేవారని అక్కడే బుడ్డి దీపం పెట్టుకుని చదివేవారని అనాటి పెద్దలు చెప్పేవారట… ఇప్పటికీ ఆ గది అలానే చెక్కు చెదర కుండా ఉంది. దీంతో కొంతమంది అభిమానులు అప్పుడప్పుడు ఆ గదిని చూడటానికి వస్తుంటారన్నారు స్థానికులు.
ఇక ఆ ఇంటి సమీపంలోనే మరో సినీ నటుడు ఎస్వీ రంగారావు బంధువులు నివసించేవారని అప్పుడప్పుడు ఎస్వీఆర్ కూడా కన్నా వారి తోట వచ్చేవారట.. ఆ జ్నాపకాలను స్థానికులు అప్పుడప్పుడు నెమరు వేసుకుంటుంటారు. ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి సినీ నటుడిగా ఎదిగిన తర్వాత తాము ఉన్న రూం ఎలా ఉందంటూ స్నేహితులను అడిగేవారని తెలుస్తుంది. ఎనబై ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ ఆ గది అలానే ఉంది. దీంతో ఆయన అభిమానులు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ఆ గదిని చూసి వెల్తుంటారు.































