ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని మందు బాటిల్‌పైనే రాసి ఉంటుంది. అయినా ఆ అలవాటును మానుకోవడానికి మాత్రం మందు బాబులు ఇష్టపడరు.
అయితే బీర్ తాగితే ఏమవదు, పైగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొందరు భావిస్తుంటారు. అప్పుడప్పుడు ఒక బీర్ తాగితే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని తమకు తాము సర్ది చెప్పుకుంటుంటారు. నిజంగానే బీర్ తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా.? ఇందులో ఎంత నిజం ఉంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రెగ్యులర్‌గా బీర్ తాగితే మెదడు సామర్థ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. బీర్‌లోని ఆల్కహాల్ న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరుకు అడ్డంకిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిక కారణంగా జ్ఞాపశక్తి తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే బీర్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే.. మానసిక సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. ఆల్కహాల్ డిప్రెషన్‌కు దారి తీస్తుందని అంటున్నారు. సెరటోనిన్, డోపమైన్ మధ్య నియంత్రణ పట్టాలు తప్పేలా చేస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది.
ఇక బీరును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. దీంతో సహజంగానే ఎక్కువగా తింటుంటాం. ఇది బరువు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. బీర్ వల్ల మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది అల్జైమర్స్‌కు దారి తీస్తుందని అంటున్నారు. బీర్ తాగితే మంచి నిద్ర సొంతమవుతుందని అంతా భావిస్తుంటారు. అయితే నివ్ర వచ్చినట్లే అనిపించినా.. ఆ తర్వాత నిద్రకు ఆటంకం కలుగుతుంది. డీహైడ్రేషన్, అతిగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం వల్ల నిద్రలేమికి కారణమవుతుంది.
నిత్యం బీర్ తాగే వారిలో లివర్, గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. బీర్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనికారణంగా చర్మం పొడిబారి కాంతి, నిగారింపు కోల్పోతుంది. ముఖం కూడా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.