AP Schemes: పథకాలకు ఈసీ బ్రేక్ పై హైకోర్టుకు లబ్దిదారులు – లంచ్ మోషన్ విచారణ..

www.mannamweb.com


ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఎన్నికల వేళ భారీ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పథకాలకు డబ్బులు విడుదల చేయకుండా ఈసీ నిన్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చేయూత, విద్యాదీవెన, రైతు భరోసా వంటి పథకాలకు నిధులు విడుదల కాకుండా పోయాయి. దీంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. దీనిపై వైసీపీ వర్సెస్ విపక్షాల వార్ మొదలైంది. ఈ క్రమంలోనే మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్ పేరుతో నిధులు విడుదల చేయకుండా అడ్డుకోవడం సరికాదంటూ హైకోర్టులో మహిళా సంఘాలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ మేరకు ఈసీ ఇచ్చిన ఆదేశాలపై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టును కోరాయి. దీంతో ఈ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది.

ఎన్నికలకు ముందే సీఎం జగన్ బటన్ నొక్కేసిన ఈ పథకాల డబ్బులు ఇప్పటివరకూ లబ్దిదారుల ఖాతాల్లో పడలేదు. ఈ నిదుల విడుదలకు అనుమతి ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఈసీని ఆశ్రయించింది. అయితే ఈసీ మాత్రం ఎన్నికలు ముగిసేవరకూ పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది. ఎన్నికలు ముగిశాక నిధులు విడుదల చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆయా పథకాలు అందుకుంటున్న లబ్దిదారులకు షాక్ తగిలింది. మరోవైపు దీనిపై రాజకీయ రచ్చ కూడా మొదలైంది. పథకాలను విపక్షాలు ఈసీ సాయంతో అడ్డుకుంటున్నాయని వైసీపీ ఆరోపిస్తుండగా.. విపక్షాలు మాత్రం జగన్ ఉద్దేశపూర్వకంగానే బటన్ నొక్కి ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదని కౌంటర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇవాళ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.