రోజురోజుకూ బెంగళూరు రద్దీగా మారిపోతోంది. ఐటీ కంపెనీల నుంచి స్టార్టప్స్ వరకు ఈ నగరంలోనే ఏర్పాటుకు మెుగ్గుచూపుతున్న వేళ ఉద్యోగం కోసం నగరానికి మారుతున్న వ్యక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.
దీంతో అద్దెదారుల కష్టాలు సర్వసాధారణంగా మారిపోయాయి.
తాజాగా బెంగళూరులో జరిగిన ఒక సంఘటన బెంగళూరులో నివసిస్తున్న వ్యక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. బెంగళూరులోని ఇంటి యజమానులు పెనుముప్పుగా మారారని స్టార్టప్ వ్యవస్థాపకుడు శ్రవణ్ టికూ పేర్కొన్నారు. తమ అద్దె అపార్ట్మెంట్లో ఒక జంటకు ఎదురైన సంఘటనను ఆయన పంచుకున్నారు. సదరు ఫ్యామిలీ రెండు గదెల ఇంటిని నెలకు రూ.55,000 అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో అవసరమైన మెయింటెనెన్స్ పనుల కోసం దాదాపు రూ.లక్ష ఖర్చు చేశారు. అయితే సమస్య ఇక్కడితో ఆగిపోలేదు.
సదరు దంపతులు ఇంటిని ఖాళీ చేస్తున్న సమయంలో యజమాని వారు సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో చెల్లించిన రూ.1.75 లక్షలు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించటంతో సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. బెంగళూరులో ఇప్పటికే అధిక అద్దెల రూపంలో ఉద్యోగులు భారాన్ని మోస్తుండగా.. యజమానులు ఇలా కిరాతకంగా వారి డబ్బు తినేయటం ఆందోళనలు రేకెత్తిస్తోంది. కెరీర్ కోసం అనేక కలలతో నగరానికి వస్తున్న స్థానికేతరులు భూస్వాముల ప్రవర్తన, దోపిడీతో మోసపోతున్నారని టికూ వెల్లడించారు.
ఇక్కడ జంట ప్రతినెల సమయానికి అద్దెను అంగీకరించిన రూ.55 వేలు సమయానికి వెల్లడించారు. అయితే చివరికి వారు నెలకు రెండు నెలల అద్దె చెల్లించిన భారాన్ని ఎదుర్కొన్నట్లు టికూ పేర్కొన్నారు. జంట ఒక రాజీకి ప్రతిపాదించి.. ఒక నెల అద్దె తగ్గించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరినప్పటికీ ఇంటి యజమాని దీనిని పూర్తిగా నిరాకరించాడు. ఇంటి యజమాని ఎదురుతిరగటంతో చేసేదేం లేక సదరు దంపతులు డిపాజిట్ మెుత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
బెంగళూరులో అద్దె పెంచే విషయానికి వస్తే ఇంటి యజమానులు వెంటనే ఫోన్ చేసి ఆ విషయాన్ని అద్దెకు ఉంటున్న వ్యక్తులకు చెప్పటంతో పాటు దానిని ఫాలో చేస్తున్నారు. కానీ అద్దెదారులు చట్టబద్ధమైన సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, వాటిని పరిష్కరించడం అకస్మాత్తుగా అద్దెకు ఉండేవారి సమస్యగా మారిపోవటంపై టికూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బెంగళూరు నగరంలో ఇలాంటి అనేక ఘటనలు చూశానని ఆయన పేర్కొన్నాడు. అద్దెకు వచ్చే ముందు అప్రమత్తంగా లేకపోతే అనుకోకుండా ఇలాంటి పరిస్థితులతో నష్టాన్ని చూడవచ్చని పేర్కొన్నారు.