తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, నటులపై కేసులు నమోదయ్యాయి. పలువురు పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు.
తాజాగా.. ఇదే ఇష్యూలో స్టార్ హీరోలు ప్రభాస్, నందమూరి బాలకృష్ట, గోపిచంద్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
కారణం ఏంటి..
ఫిర్యాదు ప్రకారం.. ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ సీజన్-2 షో జరిగింది. దీంట్లో హీరోలు ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణ సంయుక్తంగా ‘Fun88’ అనే చైనీస్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు అంటూ.. మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. లక్షలాది మందిని మోసం చేశారని, పైన పేర్కొన్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు సీరియస్..
తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో పలువురు సినీ, టీవీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, యాంకర్లు, నటులు, మోడల్స్‌పై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం చట్టవిరుద్ధం. అయినా, కొందరు ప్రముఖులు డబ్బుకు ఆశపడి ఈ యాప్‌లను ప్రమోట్ చేశారు. ఈ యాప్‌ల కారణంగా చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకుని, అప్పులపాలై, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఈ వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.
వీరికి నోటీసులు..
ఈ కేసులో భాగస్వాములైన వారిని గుర్తించి, వారికి నోటీసులు జారీ చేశారు. కొందరిని విచారించారు. కొందరు ప్రముఖులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రమోషన్ల కోసం చేసుకున్న ఒప్పందాలు, డబ్బులపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో యాంకర్ శ్యామల, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఇంకా పలువురు ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇంకా పలువురు నటులు, యాంకర్లు, మోడల్స్‌కు నోటీసులు జారీ చేశారు.
కఠిన చర్యలు ఉంటాయ్..
బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు. నేరం చేసినట్లు నిర్ధారణ అయితే.. కోర్టులు జైలు శిక్ష, జరిమానా విధిస్తాయి. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం వల్ల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయవచ్చు. 2022లో కేంద్ర ప్రభుత్వం, “యాడ్స్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” కొన్ని నిబంధనలు విధించింది. చాలామంది ఐపియస్ అధికారులు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ గురించి హెచ్చరించారు.