Bettings on Ap Elections: ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఓటర్లు కూడా గతంలో ఎన్నడూ లేనంత చైతన్యంగా పోలింగులో పాల్గొన్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైంది.
ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారం ఎవరిది, ఓటరు నాడి ఎటుందనేది తేలడం లేదు. బెట్టింగులు మాత్రం పీక్స్‌కు చేరుుతున్నాయి. లక్షకు ఐదు లక్షలు కూడా కాస్తున్నారు.
ఏపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎవరు అధికారంలో వస్తారనే చర్చే ఉంది. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన-బీజేపీలు దేనికవే అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇరు వర్గాలు 120కు పైగా సీట్లతో అధికారం చేజిక్కించుకుంటామంటున్నాయి. ఈలోగా పందెం రాయుళ్లు హడావిడి పెరిగింది. వాట్సప్, టెలీగ్రామ్ ద్వారా పందేలను ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ఎవరు గెలుస్తారు, మెజార్టీ ఎంత వస్తుంది, అధికారం ఎవరికి వస్తుంది, ఏ పార్టీకు ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలతో పాటు మంగళగిరి, పిఠాపురం, కుప్పం, పులివెందుల, హిందూపురంలో మెజార్టీ ఎంత ఉంటుందనే విషయాలపై పందేలు కాస్తున్నారు. లక్షకు 5 లక్షలు కూడా పెందేలు కాస్తున్నారు.
కోడి పందేల తరహాలో బెట్టింగులు కన్పిస్తున్నాయి. అత్యధిక పందేలు కాస్తున్న నియోజకవర్గాల్లో మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి ఉన్నాయి. ఇక రెండో స్థానంసలో నెల్లూరు రూరల్, దర్శి, చీరాల, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు 50 వేలకు పైగా మెజార్టీ వస్తుందంటూ ఓ వ్యాపారి 2.5 కోట్లు బెట్టింగు వేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఉండిలో రఘురామకృష్ణంరాజుపై బెట్టింగు జరుగుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంకు వచ్చే ఎమ్మెల్యే , ఎంపీ సీట్లపై ఎక్కువగా పందేలు కాస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగులు ఎక్కువగా నడుస్తున్నాయి. సొంతంగా సర్వేలు చేయించుకుని మరీ బెట్టింగులు నడుపుతున్నారు. ఎక్కువశాతం బెట్టింగులు కూటమి విజయంపై జరుగుతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వస్తుందనే అంశంపైనే ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న బెట్టింగులన్నీ పోలింగ్ సరళిపై అంచనాలు, సొంత సర్వేలు, మీడియా కధనాల ఆధారంగా సాగుతున్నవే. జూన్ 4న ఈ పందేలు ఎవరిని కోటీశ్వరుల్ని చేస్తాయో ఎవరి కొంప ముంచుతాయో తెలియడం లేదు.