Bhuma Akhilapriya body guard Nikhil attacked: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ మొదలయ్యాయా? అవుననే అంటున్నారు అక్కడి ప్రజలు. ఎన్నికల పోలింగ్ తర్వాత ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమా అఖిలప్రియ బాడీగార్డుపై మర్డర్ ప్లాన్ జరిగింది.
దీని వెనుక ఎవరున్నారు? రాజకీయ ప్రత్యర్థులా? లేక ఫ్యాక్షన్ కక్షలా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
అసలేం జరిగిందంటే.. మంగళవారం అర్థరాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ రోడ్డుపై ఓ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మాటల తర్వాత పక్కకు వస్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అతడ్ని హిట్ కొట్టింది. కారు వేగానికి నిఖిల్ పైకి వెళ్లి కిందపడ్డాడు. ఈలోగా కారు ముందుకు వెళ్లి ఆగింది. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి ఆయన్ని వెంటాడారు. చివరకు నిఖిల్ వీధిలోకి పారిపోవడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి కారులో పరారయ్యారు.
తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తోటి వ్యక్తి తరలించాడు. వెంటనే భూమా ఫ్యామిలీకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అయినా పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నమాట. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారనేది మిస్టరీగా మారింది. కారులో వచ్చిన వ్యక్తులెవరు? అర్థరాత్రి ఆ సమయంలో నిఖిల్ రోడ్డుపై ఉన్నట్లు ప్రత్యర్థులకు ఎవరు సమాచారం ఇచ్చారు? ఇలా రకరకాల ప్రశ్నలు పోలీసులను వెంటాడుతున్నాయి.
ఆరునెలల కిందట టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నంద్యాలలో యువగళం పేరిట పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేశాడు. ఆ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్టు అక్కడి ప్రజలు భావిస్తున్నారు. తాజా ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు, వ్యక్తుల వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.