సీఏ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. ఇకపై ఫైనల్‌ పరీక్షలూ ఏడాదికి మూడుసార్లు

చార్టెర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ) పరీక్షలకు సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి సీఏ ఫైనల్‌ పరీక్షల్ని సైతం ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం CA Final exams ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది మార్చిలో సీఏ ఇంటర్‌, ఫౌండేషన్‌ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఐసీఏఐ.. తాజాగా సీఐ ఫైనల్‌ పరీక్షలను సైతం అదే తరహాలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులకనుగుణంగా విద్యార్థులకు గొప్ప అవకాశాలను అందించేందుకు సీఏ ఫైనల్‌ పరీక్షల్ని సైతం ఏడాదిలో మూడుసార్లు నిర్వహించేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ICAI ఓ ప్రకటనలో తెలిపింది. తాజా నిర్ణయంతో సీఏ ఫైనల్‌, ఇంటర్‌, ఫౌండేషన్‌ పరీక్షలు ఏడాదిలో మూడుసార్లు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలు జనవరి, మే, సెప్టెంబర్‌ నెలల్లో జరుగుతాయని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.