ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. NPS, EPFలో వచ్చిన ఈ 10 కీలక మార్పులు తప్పక తెలుసుకోవాల్సిందే

భారతదేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు తమ పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఎక్కువగా ఆధారపడే పథకాలు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF). ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే ఈ పథకాలు తక్కువ రిస్క్‌తో స్థిరమైన ఆదాయం అందిస్తాయనే నమ్మకంతో లక్షల మంది వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా ఈ పథకాల నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తూ వస్తోంది. తాజాగా తీసుకువచ్చిన మార్పులు రిటైర్మెంట్ నిధులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.


NPSలో కీలక మార్పులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉపసంహరణ నిబంధనల్లో గణనీయమైన సడలింపులు చేశారు. ఇప్పటివరకు పదవీ విరమణ సమయంలో మొత్తం పొదుపులో కనీసం 40 శాతం మొత్తాన్ని అనివార్యంగా పెన్షన్ ప్లాన్ (అన్యుటీ) కొనుగోలుకు వినియోగించాల్సి ఉండేది. తాజా మార్పుతో ఈ నిబంధనను 20 శాతానికి తగ్గించారు. ఫలితంగా, రిటైర్ అయిన వారు తమ మొత్తం కార్పస్‌లో 80 శాతం వరకు ఒకేసారి ఉపసంహరించుకునే అవకాశం పొందారు. ఇది రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక ఒత్తిడిని గణనీయంగా తగ్గించనుంది.

తక్కువ మొత్తంలో పొదుపు ఉన్న ఖాతాదారులకు మరో కీలక వెసులుబాటు కల్పించారు. NPS ఖాతాలో రూ.8 లక్షల వరకు కార్పస్ ఉన్నవారు ఇకపై తప్పనిసరిగా పెన్షన్ ప్లాన్ కొనాల్సిన అవసరం లేకుండా మొత్తం మొత్తాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. ఇది చిన్న పెట్టుబడిదారులకు పెద్ద ఊరటగా మారనుంది.

పెట్టుబడి కాలం, ఉపసంహరణలపై సడలింపులు NPSలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత పథకం నుంచి నిష్క్రమించే అవకాశాన్ని పొందారు. అలాగే, కావాలనుకుంటే 85 ఏళ్ల వయస్సు వరకు పెట్టుబడిని కొనసాగించే వెసులుబాటు ఉంది. 60 ఏళ్ల వయస్సు చేరేలోపు పాక్షిక ఉపసంహరణల సంఖ్యను మూడు నుంచి నాలుగుకు పెంచారు. అయితే ప్రతి ఉపసంహరణ మధ్య కనీసం నాలుగు సంవత్సరాల విరామం తప్పనిసరిగా పాటించాలి.

మరొక కీలక మార్పు ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించినది. 2025 అక్టోబర్ నుంచి ప్రభుత్వేతర NPS ఖాతాదారులు తమ పెట్టుబడుల్లో 100 శాతం వరకు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే అవకాశం పొందనున్నారు. ఇప్పటివరకు ఈ పరిమితి 75 శాతంగా ఉండేది. దీని ద్వారా దీర్ఘకాలంలో అధిక రాబడుల అవకాశాలు పెరగనున్నాయి.

EPFలో సరళీకరణ చర్యలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) విషయంలో కూడా నియమాలను మరింత సులభతరం చేశారు. EPFO 3.0 కింద ఉపసంహరణకు ఉన్న 13 కారణాలను ఇప్పుడు మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి – అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు. అన్ని విభాగాలకు కనీస సేవా కాలాన్ని 12 నెలలకు తగ్గించారు.

EPF బదిలీలు, ఉపసంహరణల్లో యజమాని ఆమోదం అవసరం ఉండటంతో చాలాకాలంగా జాప్యాలు ఎదురవుతున్నాయి. కొత్త విధానం ప్రకారం, సాధారణంగా యజమాని అనుమతి లేకుండానే ఉపసంహరణలు, బదిలీలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగాలు మారే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి.

వేగవంతమైన క్లెయిమ్ పరిష్కారం ఇకపై రూ.5 లక్షల వరకు ఉన్న EPF క్లెయిమ్‌లు మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం లేకుండా స్వయంచాలకంగా పరిష్కరించనున్నారు. దీనివల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. భద్రత కోసం ఉమాంగ్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. డిజిటలైజేషన్‌తో EPF వ్యవహారాలు మరింత నమ్మదగినవిగా మారాయి.

ఉద్యోగం కోల్పోయిన తర్వాత పూర్తి EPF మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు వేచి ఉండే కాలాన్ని రెండు నెలల నుంచి 12 నెలలకు పెంచారు. అయితే, సభ్యులు తమ ఖాతాలో ఉన్న మొత్తంలో 100 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు, కానీ ఖాతా కొనసాగేందుకు మరియు వడ్డీ పొందేందుకు కనీసం 25 శాతం బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది.

విత్ డ్రా లిమిట్ పెంపు: విద్య అవసరాల కోసం 10 సార్లు, వివాహ ఖర్చుల కోసం ఐదు సార్లు వరకు EPF నుంచి ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. గతంలో ఉన్న పరిమితులతో పోలిస్తే ఇది పెద్ద మార్పు. అవసరమైన పత్రాల సంఖ్యను కూడా తగ్గించారు. అనేక సందర్భాల్లో స్వీయ-ప్రకటన ఆధారంగా క్లెయిమ్‌లను అనుమతించడం వల్ల కాగితపు పనికి చెక్ పడింది.

ఈ మార్పులన్నీ కలిపి చూస్తే, NPS, EPF పథకాలు ఇప్పుడు మరింత సౌలభ్యంగా, పెట్టుబడిదారుల అనుకూలంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్న వారు ఈ తాజా నిబంధనలను తెలుసుకుని తమ పెట్టుబడి వ్యూహాలను సరిచేసుకోవడం ఎంతో అవసరం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.