ఏపీలోని ఆ జిల్లాలకు బిగ్ అలెర్ట్.

 ఏపీకి( Andhra Pradesh) వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. గత నెలలో దంచి కొట్టిన వానలకు బ్రేక్ పడ్డాయి. ఇప్పుడు మరోసారి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.


ఉత్తర తమిళనాడు దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు మీదుగా బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు.. ఉపరితల ద్రోణి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రభావంతోనే దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమలో చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి.

* వెంటాడుతున్న వర్షాభావం..
అయితే కోస్తాలో( coastal area) చాలా జిల్లాల్లో, చాలా ప్రాంతాల్లో వర్షాభావం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ముఖం చాటేస్తున్నాయి. వర్షం కురిసే రోజుల మధ్య కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో వర్షపాతం లోటు అధికంగా ఉంది. దీనికి తోడు చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. మంగళవారం నుంచి రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం శుక్రవారం వరకు వర్షాలు ఉంటాయని చెబుతోంది.

* భారీ వర్షం నమోదు..
ఈరోజు పార్వతీపురం మన్యం( parvatipuram manyam ), అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లా వెలగపాడు లో 73 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా ఎడమర్రిలో 67 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా గుడ్ల దోనలో 57 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా కరప లో 51 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 97.6 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా కోయిలకుంట్లలో 65.8, ప్రకాశం జిల్లా పొదిలిలో 65.4, పార్వతీపురంలో 64.5, కురుపాంలో 61.2, చిత్తూరు జిల్లా పుంగనూరులో 52 పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

* మండుతున్న ఎండలు..
అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. నడి వేసవిని తలపిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఆపై విపరీతమైన ఉక్క పోత ఉంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు సైతం ఎండిపోతున్నాయి. వర్షపాతం లోటు ఉండటంతో ఖరీఫ్ పై ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో ఉబాలు కూడా పూర్తి కాలేదు. కేవలం సాగునీటి వనరులు ఉన్నచోట మాత్రమే ఉబాలు పూర్తయ్యాయి. వరి మడులు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వాతావరణ శాఖ వర్ష సూచన చేయడం పై ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.