లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఏపీపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో రాబట్టేందుకు బీజేపీ పక్కాగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
ఈ మేరకు ఏపీలో ఉన్న కాపు సామాజికవర్గాన్ని తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ తరపున రాజ్యసభకు పంపనున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామంతో ఏపీ తమ పార్టీకి కొత్త ఊపు వస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఆ పథకంలో భాగంగానే ఇటీవలే ఆయనను రామమందిర ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాలంటూ ప్రత్యేక ఆహ్వానం కూడా పంపింది. అదేవిధంగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని సైతం కట్టబెట్టింది. అదేవిధంగా ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన జీవీఎల్ నరసింహారావు స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపనున్నట్లుగా సమాచారం. అయితే, బిహార్‌లో కూడా బీజేపీ సరిగ్గా ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేసింది. అక్కడ జననేతగా పేరుపొందిన మాజీ మఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.