ఇప్పటివరకు రైళ్లల్లో ఏదైనా పార్శిల్ పంపాలంటే పార్శిల్ కౌంటర్ల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ చాలా పెద్దగా ఉండేది. కానీ ఇక నుంచి అలాంటి కష్టం ఉండదు. హాయిగా ఇంటి నుంచే మొబైల్ ద్వారా పార్శిల్ బుకింగ్ చేయొచ్చు. అంతేకాకుండా ట్రాక్ కూడా చేయొచ్చు.
దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్శిల్ సేవలను మరింత విస్తరించి ప్రజలకు వేగవంతంగా సేవలు అందించేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఈ యాప్‌లోనే ప్రజలు పార్శిల్ బుకింగ్, డెలివరీ సేవలను ఇంటి వద్దనే పొందవచ్చు.ఈ మొబైల్ ద్వారానే వాటిని ట్రాక్ కూడా చేయొచ్చు. ఈ యాప్‌ను తొలుత ఫైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ డివిజన్ వ్యాప్తంగా అందుబాటులో తీసుకురానున్నారు. జనాల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా జోన్‌లలో కూడా ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఏజెన్సీలు, వ్యక్తులతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే చూస్తోంది. పికప్ ,డెలివరీ చేసేందుకు సర్వీస్ ప్రొవైడర్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగలవారు హైదరాబాద్ డివిజన్‌లోని వాణిజ్య విభాగాన్ని మెయిల్ ద్వారా లేదా స్వయంగా సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.
ఈ కొత్త యాప్ ద్వారా పికప్,డెలివరీ సేవలను ఒకేచోటకు తీసుకురానున్నారు. పార్శిల్ సేవలను మరింత సులభతరం, వేగవంతం, పారదర్శకంగా చేయడం కోసం యాప్ ఉపయోగపడనుంది. పార్శిల్ సరుకులను బుకింగ్ చేయడానికి, సరుకులను ట్రాక్ చేయడానికి వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది.అంతేకాకుండా వ్యక్తులు, వ్యాపారులు, లాజిస్టిక్స్ భాగస్వాములను ఒకే డిజిటల్ వ్యవస్థ కిందకు తీసుకురావడానికి కూడా సహకరిస్తుంది. సామాన్యులు తమ ఇళ్లలోనే కూర్చొని దేశంలోని ప్రతి మూలకు పార్శిళ్లను పంపడానికి సులువు అవుతుంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ సేవల గురించి మాట్లాడుతూ..’ వినియోగదారులకు ఇంటివద్దకే పార్శిల్ సేవను అందించడం పార్శిల్ రవాణాలో కీలకమైన మార్పుగా పేర్కొన్నారు. ఇందుకోసం రైల్వేలతో కలసి ముందుకు వెళ్ళడానికి సహకరించాలని లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లకు సూచించారు. తద్వారా ఇద్దరికీ లాభం జరుగుతుంది’ అని అన్నారు.
యాప్ ప్రత్యేకతలు
-ఆన్‌లైన్ బుకింగ్, డిజిటల్ చెల్లింపులు , రియల్ టైమ్ పార్శిల్ ట్రాకింగ్
-సజావుగా ఎండ్-టు-ఎండ్ సర్వీస్
– మెరుగైన పారదర్శకత



































