బిగ్ న్యూస్… బ్లడ్‌ గ్రూప్‌తో సంబంధం లేకుండా కిడ్నీ మార్పిడి?

కిడ్నీ మార్పిడి అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ… ఎందుకంటే కిడ్నీ మార్పిడిలో అతిపెద్ద సమస్య కిడ్నీని సరిపోల్చడం. ఎవరికైనా కిడ్నీ అవసరం పడినప్పుడు…


వారికి సరిపోలే దాత కిడ్నీ లభించాల్సి ఉంటుంది. ఇందులో ఒకే బ్లడ్ గ్రూప్ సరిపోలడం అవసరం. ఒకే బ్లడ్ గ్రూప్ లేకపోవడం వల్ల… కొన్ని సందర్భాల్లో కిడ్నీ కోసం నెలలు, సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కిడ్నీ మార్పిడి ప్రక్రియలో ఈ సమస్యకు ముగింపు దిశగా కీలక ముందడుగు వేశారు. కెనడా, చైనా శాస్త్రవేత్తలు ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికైనా మార్పిడి చేయగల యూనివర్సల్ కిడ్నీని విజయవంతంగా పరీక్షించారు. ఈ మేరకు సైన్స్ అలర్ట్ రిపోర్టు చేసింది. ఈ పరిశోధన కిడ్నీ మార్పిడి చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదని, లక్షలాది మంది రోగులకు కొత్త ఆశాకిరణంగా మారనుందని భావిస్తున్నారు.

ఈ పరిశోధనలో భాగంగా బ్రెయిన్‌ డెడ్ అయిన వ్యక్తి శరీరంపై వారి కుటుంబ అనుమతితో పరీక్షలు నిర్వహించారు. వారు అభివృద్ది చేసిన కిడ్నీని బ్రెయిన్‌ డెడ్ అయిన వ్యక్తి శరీరంలో ప్రయోగాత్మకంగా అమర్చగా, అది కొన్ని రోజులు సజీవంగా పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

”మానవ నమూనాలో ఈ ప్రక్రియను మనం చూడటం ఇదే మొదటిసారి” అని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ స్టీఫెన్ విథర్స్ చెప్పారు. దీర్ఘకాలిక ఫలితాలను ఎలా మెరుగుపరచాలనే దానిపై ఇది అపారమైన అవగాహన ఇస్తుందని తెలిపారు.

ప్రస్తుతం టైప్ ‘O’ బ్లడ్ గ్రూప్ కలిగిన రోగులు… అదే గ్రూప్ రక్తం కలిగిన కిడ్నీ దాతలు దొరికేవరకు చాలా కాలం వేచి చూడాల్సి వస్తోంది. అయితే టైప్ ‘O’ బ్లడ్ గ్రూప్‌ కలిగిన వ్యక్తులు కిడ్నీలు… ఇతర బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కూడా సరిపోతాయి కాబట్టి, వాటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం వివిధ బ్లడ్ గ్రూప్‌ల మూత్రపిండాలను మార్పిడి చేయడం సాధ్యమే అయినప్పటికీ… గ్రహీత శరీరాన్ని అవయవాన్ని తిరస్కరించకుండా శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత ప్రక్రియ క్లిష్టమైనది.. అంతేకాకుండా ముఖ్యంగా ఆచరణాత్మకమైనది కాదు.

అయితే కొత్త పరిశోధనల్లో పరిశోధకులు టైప్ ”A” కిడ్నీని టైప్ ”O” కిడ్నీగా సమర్థవంతంగా మార్చారు. టైప్ A రక్తం నుంచి చక్కెర అణువులను (యాంటిజెన్‌లు) తొలగించే ప్రత్యేకమైన ఎంజైమ్‌లను ఉపయోగించారు. స్టీఫెన్ విథర్స్ ఈ ప్రక్రియను కారు నుండి ఎరుపు పెయింట్‌ను తొలగించడంతో పోల్చారు. ”ఇది ఒక కారుపై ఉన్న ఎరుపు పెయింట్‌ను తుడిచేసి క్రింద ఉన్న న్యూట్రల్ ప్రైమర్‌ను బయటపెట్టినట్లే. ఇలా చేస్తే శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ దానిని వేరే అవయవంగా గుర్తించదు” అని అన్నారు.

అయితే ఈ పరిశోధనలు… జీవించి ఉన్న మానవులలో పరీక్షలను పరిగణించే ముందు చాలా సవాళ్లు వేచి ఉన్నాయి. మార్పిడి చేయబడిన మూత్రపిండం మూడో రోజు నాటికి మళ్ళీ A బ్లడ్ గ్రూప్ సంకేతాలను చూపించడం ప్రారంభించింది. అయితే సాధారణంగా కనిపించే తీవ్రమైన రోగనిరోధక ప్రతిస్పందన కంటే ఇది తక్కువగా ఉండటం ఆశాజనకమని పరిశోధకులు చెప్పారు. శరీరం మూత్రపిండాన్ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయని అన్నారు.

ఇక, ఒక అమెరికాలోనే ప్రస్తుతానికి ప్రతిరోజూ 11 మంది కిడ్నీ మార్పిడి కోసం వేచి ఉండి మరణిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది టైప్ ”O” మూత్రపిండాల కోసం వేచి ఉన్నారు. ఇక, శాస్త్రవేత్తలు పంది మూత్రపిండాలను ఉపయోగించడం, కొత్త ప్రతిరోధకాలను అభివృద్ధి చేయడంతో సహా బహుళ కోణాల నుంచి దీనిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త సాంకేతికత అవయవ సరిపోలికకు అడ్డంకిని గణనీయంగా తగ్గించగలదు. యూనివర్సల్ కిడ్నీ టెక్నాలజీ విజయవంతమైతే, రోగి సంరక్షణలో సంవత్సరాల శాస్త్రీయ కృషికి ఇది ప్రత్యక్ష ఫలితం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.