బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే

కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి తెలియకుండానే పార్టీలోకి


రాయికల్‌: జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చారు.

ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి ఆదివారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోగల సీఎం రేవంత్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. రెండురోజుల వ్యవధిలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. సంజయ్‌కుమార్‌ 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2018లో మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి అదే జీవన్‌రెడ్డిపై విజయం సాధించారు. తిరిగి 2023లో జరిగిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపైనే మరోసారి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. జాగృతి అధ్యక్షురాలు కవితకు నమ్మిన బంటుగా ఉన్న సంజయ్‌.. ఆమె అరెస్ట్‌ అయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు కొంత దూరందూరంగా ఉంటున్నారు.

మరోవైపు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ కనీసం సమావేశం కాకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా తర్జనభర్జనలో ఉన్న ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అయితే సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పార్టీలో సీనియర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కూడా తెలియదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్‌రెడ్డికి తెలియకుండా ఆయన పార్టీలో చేరడంతో జిల్లాలో రాజకీయం మలుపుతిరిగే అవకాశముంది.