ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాక్ ఇవ్వటానికి రెడీ అయ్యింది. తెలంగాణా రాష్ట్రంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి మరో ఆర్ధిక భారం వెయ్యటానికి రంగం సిద్ధం చేసింది, రోడ్డు భద్రతా సెస్ పేరుతో మరో కొత్త ఆర్ధిక భారాన్ని ప్రజలపై మోపటానికి ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణా ప్రభుత్వం.
కొత్త బాదుడుకు రంగం సిద్ధం చేసిన తెలంగాణా సర్కార్
కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు మార్చి 1 నుండి రోడ్ సేఫ్టీ సెస్ కూడా కట్టాల్సి ఉంటుంది. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసుకునే వాహనదారులకు వాహనాన్ని బట్టి 2 వేల రూపాయల నుండి 10 వేల రూపాయల వరకు రోడ్దు భద్రతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మోటారు వాహన చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఉన్న అధికారాలను బట్టి తెలంగాణా రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి నుండి కొత్త వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ ఇలా
ఈ ఆదేశాల ప్రకారం నాన్ ట్రాన్స్పోర్ట్ యజమానులు అదనంగా 2 వేల రూపాయల నుండి 10 వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, వివిధ రకాల గూడ్స్ వాహనాలు, ప్యాసింజర్ ఆటోలు ఇలా వాహనాలు ఈ సెస్ పరిధిలోకి వస్తాయి. కొత్త వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాలి.
2 వేల నుండి 10 వేల వరకు సెస్ వసూలు
గతంలో మూడు చక్రాల గూడ్స్ వాహనాలపై త్రైమాసిక పన్ను ఉండగా, రవాణాశాఖ ఇప్పుడు వాటిని జీవితకాల పన్ను పరిధిలోకి చేర్చింది. ఈ రోడ్డు భద్రతా పన్ను ద్విచక్ర వాహనాలకు బైక్‌లు, స్కూటీలు వంటి వాటికి రూ.2 వేలుగా నిర్ణయించారు. కార్లకు రూ.5 వేలు , గూడ్స్ వాహనాలు, 4 నుండి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణీకుల ఆటోల వంటి ఇతర వాహనాలకు రూ.10 వేల వరకు వసూలు చేస్తారు.
వ్యవసాయ వాహనాలకు మినహాయింపు
అయితే వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లు వంటి వాహనాలకు మాత్రం ఈ సెస్ నుండి మినహాయింపు ఇస్తుంది. ఏది ఏమైనా తెలంగాణా ప్రభుత్వం మరో కొత్త బాడుడుకు శ్రీకారం చుట్టటం తెలంగాణా ప్రజలకు షాక్ అనే చెప్పాలి.


































