కొన్నేళ్ల క్రితం వరకు ఐటీ (IT) ఉద్యోగుల జీవితం ఒక స్వర్ణయుగంలా ఉండేది. వారంలో ఐదు రోజులు పని, ఐదు అంకెలకు మించిన జీతం, తరచూ బోనస్‌లు, ఇంక్రిమెంట్లు.
కంపెనీ మారితే చాలు.. శాలరీ హైక్ ఆకాశాన్నంటేది. ఐటీ ఉద్యోగులకు పెళ్లి సంబంధాలు రావడానికి బంధువులు, తల్లిదండ్రులు క్యూ కట్టేవారు. కోరినంత కట్నం, బంగారం, పొలాలు ఇవ్వడానికి సిద్ధపడేవారు.
కానీ, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ఐటీ సేవలకు తగ్గిన డిమాండ్‌తో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఉద్యోగాల తొలగింపులు (Layoffs), కొత్త నియామకాల లేమి… ఈ పరిశ్రమను తిరోగమనంలోకి నెడుతున్నాయి.
గత మూడు సంవత్సరాలుగా ఐటీ రంగం నియామకాల్లో కోతలు విధిస్తోంది. దీనికి తోడు, రెండు అంశాలు నిరుద్యోగితను పెంచుతున్నాయి. కృత్రిమ మేధ (Artificial Intelligence – AI). AI అందుబాటులోకి రావడంతో, మానవ శ్రమతో చేసే పనులు ఆటోమేషన్ అవుతున్నాయి. ఫలితంగా, చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు లేదా నైపుణ్యం లేనివారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది.
కోర్ ఇంజనీరింగ్‌లో డిమాండ్ తగ్గడంతో, బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్ వైపు వస్తున్నారు. కోర్సులు చదివేవారు పెరుగుతున్నా, అందుకు తగ్గ ఉద్యోగాలు మార్కెట్‌లో లేకపోవడంతో నిరుద్యోగం పెరిగి, యువతలో నిరాశ పెరుగుతోంది.
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ (TCS) సైతం ఈ ఒత్తిడికి గురవుతోంది. ఆటోమేషన్ యుగానికి అనుగుణంగా మారలేని ఉద్యోగులను మొహమాటం లేకుండా బయటకు పంపిస్తోంది. ఐటీ ఉద్యోగులకు ఒకప్పుడు అపారమైన భద్రత, స్థిరత్వం ఉండేవి. కానీ, నేటి ఆటోమేషన్ యుగంలో నిరంతరం నైపుణ్యాలను పెంచుకోనిదే, ఎంతటి అనుభవం ఉన్న ఉద్యోగి అయినా తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కష్టంగా మారింది.
గూగుల్ సైతం
చిన్న సంస్థలు మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడిపిస్తున్న గూగుల్ వంటి దిగ్గజాలు కూడా తమ ఉద్యోగులను ఇంటికి పంపుతుండటం ఇప్పుడు ఉద్యోగుల్లో భయాన్ని పెంచుతోంది. తాజాగా జరిగిన ఈ తొలగింపులు యాదృచ్ఛికంగా జరగలేదు. ఇది ఒక వ్యూహాత్మక పునర్నిర్మాణం అని గూగుల్ సంస్థ స్పష్టం చేసింది.గూగుల్ ఈ కోతలను కేవలం ఖర్చు తగ్గించుకోవడానికి మాత్రమే కాకుండా, తమ పెట్టుబడిని వృద్ధికి అత్యంత కీలకంగా భావించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాలకు తరలించడానికి చేపట్టింది. AI లో పెట్టుబడులు భారీగా పెంచాలనే కంపెనీ లక్ష్యాన్ని ఈ చర్య బలంగా సూచిస్తోంది.
AI రాకతో కొన్ని ఉద్యోగాలు మరింత మెరుగవుతుంటే, డేటా విశ్లేషణ, ప్లాట్‌ఫామ్ డిజైన్ వంటి సాంప్రదాయ స్థానాలు వేగంగా ఆటోమేషన్‌కు గురవుతున్నాయి. ఈ ఉదంతం, భవిష్యత్తులో ఉద్యోగులు AIకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను అత్యవసరంగా గుర్తుచేస్తోంది.తొలగించబడిన కొంతమంది ఉద్యోగులకు గూగుల్ ఊరటనిచ్చే ఒక ఆప్షన్ ఇచ్చింది: డిసెంబర్ ప్రారంభం వరకు కంపెనీలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వెతుక్కోవడానికి అవకాశం కల్పించింది. వేరే ఉద్యోగం దొరికితే గట్టెక్కినట్టే, లేదంటే ఇంటికే.
































