తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. పండుగ ముందు జీతాలు భారీ కోత

పండుగల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు, బోనస్‌ వంటి శుభవార్తలు ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం విచిత్రం జరుగుతోంది. జీతాలు పెంచడం కాకపోగా వేతనాల్లో కోత విధించడం గమనార్హం.


జేబు నింపే పని చేయాల్సి ఉండగా జేబుకు కత్తెర వేస్తోంది. ఇప్పటికే హైడ్రా సిబ్బంది జీతాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కోత వేసింది. తాజాగా గురుకులాల ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాలను భారీ కట్‌ చేసింది. ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనం రేపుతోంది.

గురుకులాల్లోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌పై పోరాటం కొనసాగుతోంది. అయితే వారి ఆందోళనను తగ్గించడమే కాకుండా వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఆందోళన చేపడుతున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను ప్రభుత్వం తగ్గించింది. జూనియర్‌ అధ్యాపకుడికి (జేఎల్)కు రూ.35 వేల జీతం ఉండగా.. ప్రభుత్వం రూ.23,400కు తగ్గించింది. అంటే రూ.11,600 వేతనాన్ని ప్రభుత్వం కోత వేసింది. పీజీటీలకు రూ.31,395 నుంచి రూ.18,200కు కోత వేసింది. టీజీటీలకు రూ.28,660 నుంచి రూ.18,200కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

గురుకులాల్లోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం ఉద్యోగులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. పెండింగ్‌ జీతాలు విడుదల చేయాలని కోరిన ఉద్యోగుల జీతాల్లో కోత వేసింది. తగ్గించిన జీతాలు చూస్తే ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్నవారి కంటే చాలా తక్కువ ఉండడం గమనార్హం. ఈ మేరకు వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్‌సోర్సింగ్‌ విభాగంలో సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కుక్‌లు, కంప్యూటర్‌ టీచర్లు, పీడీలు, పీఈటీలు తదితర సిబ్బంది జీతాలను కూడా భారీగా తగ్గించింది.

తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీలో 204 గురుకులాలు ఉన్నాయి. వాటిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో దాదాపు 3,756 మందిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వీటిలో టీచింగ్‌ విభాగంలో ప్రిన్సిపాల్‌, జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌), టీజీటీ, పీజీటీ పోస్టులు ఉన్నాయి. గతంలో జేఎల్‌కు రూ.35 వేలు, పీజీటీ, టీజీటీలకు రూ.27 వేల వేతనం చెల్లించేవారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందికి 30 శాతం పీఆర్సీని వర్తింపజేసింది. కానీ ఆ జీతాలను రేవంత్ రెడ్డి తగ్గించడం వివాదంగా మారింది.

ఉద్యోగులు గత వేతనం తగ్గించిన వేతనం
పీజీటీలు రూ.31,395 రూ.18,200
టీజీటీలు రూ.28,660 రూ.18,200

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగికి సగటున రూ.5 వేల నుంచి రూ.13 వేల వరకు కోత
విద్యార్థులకు పాఠాలు బోధించే టీజీటీ, పీజీటీల వేతనం రూ.18,200 గా నిర్ధారణ
ఉన్నతాధికారుల వద్ద, కార్యాలయంలో పనిచేసే డ్రైవర్ల వేతనం రూ.19,500

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.