ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి భారీమెుత్తంలో ఉద్యోగాలు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు తన మానసపుత్రికలుగా నాటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదేపదే చెప్పుకునేవారు.
అయితే సచివాలయ వ్యవస్త ప్రారంభం సందర్భంగా పలు పోస్టులు భర్తీ చేశారు.అలాంటి వాటిల్లో పశుసంవర్ధక సహాయకుల (ఏహెచ్‌ఏ) ఉద్యోగం ఒకటి. అయితే ఈ పశు సంవర్థక సహాయకుల పోస్టుల భర్తీలో కొందరు నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందిన వారి జాబితా సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం
ఏపీలో పశు సంవర్థక సహాయకుల(ఏహెచ్ఏ)ల ఉద్యోగాల భర్తీ విషయంలో నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్ర పశువైద్య మండలి ఈ వ్యవహారాన్ని గుర్తించింది.ఈ క్రమంలో విచారణ ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు అర్హతగా పదో తరగతితో పాటు పశువైద్యం, డెయిరీ రంగాల్లో డిప్లొమా కోర్సులు పూర్తి చేయాలని నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నోటిఫికేషన్లలో తగినంత మంది అర్హులైన అభ్యర్థులు లభించలేదు. దీంతో మరో రెండు సార్లు ప్రకటనలు విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకున్నారని ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో తేలింది.
ఏహెచ్ఏ ఉద్యోగాల భర్తీలో నకిలీ సర్టిఫికెట్లు
ఏపీలో పశు సంవర్థక సహాయకుల(ఏహెచ్ఏ)ల ఉద్యోగాలు భారీగా ఉండటం…అభ్యర్థులు లేకపోవడంతో ఇదే మంచి అవకాశం అని భావించిన కొందరు తమ వక్రబుద్ధికి పనిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో తమక్రిమినల్ బ్రెయిన్‌కి పనిచెప్పారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా కొందరు అభ్యర్థులు పొరుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థల నుంచి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఉద్యోగాలు సంపాదించారని దర్యాప్తులో తేలింది.అలాంటి వారిని ఉపేక్షించకూడదు అని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సైలెంట్‌గా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
నేడు సర్టిఫికెట్లు పరిశీలించే ఛాన్స్
నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం పశువైద్య మండలి వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించి….విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో వందలాది మంది నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ ధ్రువపత్రాలతో ఈ పోస్టుల్లో చేరిన వారు తేలితే వారి ఉద్యోగాలు పోవడం ఖాయం అని చర్చ జరుగుతోంది. ఈ నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందిన వారిపై సోమవారం పశువైద్య మండలి కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పశుసంవర్ధక సహాయకులు తమ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వారు చదివిన విద్యాలయాలు, ఆ కాలేజీలు ప్రస్తుతం ఉన్నాయా, ధ్రువపత్రాలు కళాశాలల నుంచే జారీ అయ్యాయా వంటి వివరాలను పరిశీలిస్తారు. నకిలీ ధృవపత్రాలు సమర్పించినట్లు తేలితే వారి ఉద్యోగాలు ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


































