విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ఎంవీవీ..!
ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తిరస్కరించారు.
శుక్రవారం తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఎంవీవీ వ్యాపార పరంగా ప్రభుత్వం నుంచి తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కేసుల విచారణల నేపథ్యంలో తాను పోటీకి దిగలేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. గతంలో వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరి విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎంపిక కావడంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సీట్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నప్పటికీ ఆర్థికంగా బలవంతుడైన ఎంవీవీ అయితే బాగుంటుందని జగన్ భావించారు. తన ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిందని, పలు కేసులు నమోదు చేసిందని ఈ సమయంలో తాను పోటీ చేయలేదని ఎంవీవీ సున్నితంగా తిరస్కరించారు. దీంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోంది.
హయగ్రీవకు స్టాప్ వర్క్ ఆర్డర్..
ఎంవీవీ చేపట్టిన వివాదాస్పద హయగ్రీవ ప్రాజెక్టుకు కూడా జీవీఎంసీ పనుల నిలిపివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎంసీ స్థలంలో పనులు నిలిపివేయాల్సిందిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ ఆదేశాలు జారీ చేసింది. హయగ్రీవ విషయంలో జగదీశ్వరుడు ఎంవీవీ సత్యనారాయణపై ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎంవీవీతో పాటు ఆయన సహచరుడు జీవీ కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ శుక్రవారం జగన్‌ను కలిసి కొంతకాలం పాటు పార్టీ పరంగా తమకు ఎటువంటి బాధ్యతలు అప్పగించొద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
బీజేపీ వైపు చూపు
మరోవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ద్వారా బీజేపీలో చేరే అవకాశాలను వీరు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు తిరస్కరించడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు వీరు చూస్తున్నారని సమాచారం.