యూపీ(UP)లోని ప్రయాగ్ రాజ్(Prayagraj) లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు విదేశాల నుంచి సైతం అనేక మంది భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే అందరిలాగే కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలోనే రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. అన్నీ సర్దుకుని రైల్వే స్టేషన్కు వెళ్లగా.. రైలు ఎక్కలేకపోయాడు. అందుకు కారణం రైలు తలుపులు లోపలి నుంచి మూసి ఉండడమే. దీంతో వెనక్కి వచ్చి కుంభమేళాకు వెళ్లలేకపోయిన ప్రయాణికుడు భారతీయ రైల్వే శాఖ(Indian Railways) పై ఫిర్యాదు చేశాడు.
తన టికెట్ డబ్బులతో పాటు వాటికి వడ్డీ కట్టాలని, అలా జరగని పక్షంలో 50 లక్షల రూపాయల నష్ట పరిహారం తన కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశాడు. బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాకు చెందిన జనక్ కిషోర్ ఝా కూడా మహా కుంభమేళాకు వెళ్లాలనుకున్నాడు. కుటుంబ సభ్యులను కూడా తన వెంట యూపీకి తీసుకుని వెళ్లాలనుకున్నాడు. ఈక్రమంలోనే ఏసీ 3 కోచ్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు.
జనవరి 26వ తేదీన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్కు వెళ్లాడు. కాసేపటికి రైలు కూడా వచ్చి ఆగింది. ఈక్రమంలోనే లగేజీ తీసుకుని రైలు ఎక్కబోయాడు. కానీ తలుపులు ఎంతకూ తెరుచుకోలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక రైల్వే అధికారులను సంప్రదించాడు. కానీ వారు కూడా పెద్దగా స్పందించలేదు.
ఇలా జనక్ కిషోర్ ఝా, ఆయన కుటుంబ సభ్యులు రైలును ఎక్కలేకపోయారు. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయాడు. కానీ 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు చాలా బాధ పడ్డారు. ఆర్థికంగా కూడా నష్టపోవడంతో.. తమను కుంభమేళా వెళ్లకుండా చేసిన రైల్వే శాఖపై ఫిర్యాదు చేయాలనుకున్నాడు.
డబ్బుల మొత్తాన్ని వడ్డీతో సహా..
ఈక్రమంలోనే 15 రోజుల్లోగా తన టిక్కెట్ డబ్బుల మొత్తాన్ని వడ్డీతో సహా వాపసు చేయాల్సిందిగా భారతీయ రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను జనక్ కిషోర్ ఝా అధికారికంగా కోరారు. అదనంగా అతను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. నిర్ణీత గడువులో డబ్బులు రీఫండ్ చేయకపోతే రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశాడు.