అమిత్ షా ఫేక్ వీడియో కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ పోలీసులకు చిక్కకుండా తెలంగాణ పోలీసుల భారీ స్కెచ్..!

www.mannamweb.com


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ కామెంట్ చేస్తున్న రిజర్వేషన్ల రద్దు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు నోటీసుల పేరుతో యాక్షన్‌లోకి దిగగానే దానికి కౌంటర్‌గా తెలంగాణ పోలీసులు మాస్టర్ స్కెచ్ వేశారు. విచారణ పేరుతో ఢిల్లీకి పిలిపించాలనుకున్న వ్యూహం ఆలస్యం అవుతుండడంతో మరికొద్దిమందికి నోటీసులు ఇవ్వడానికి, ఇప్పటికే నోటీసులు అందుకున్నవారిని అరెస్టు చేయడానికి, వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. దీన్ని పసిగట్టిన తెలంగాణ పోలీసులు ఫేక్ వీడియోతో సంబంధం ఉందన్న అనుమానంతో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించకపోయినా వారంతా సీసీఎస్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఢిల్లీ పోలీసుల అదుపులోకి వెళ్లడానికి ముందే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లను పట్టేశారు. ఆ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులోకి వెళ్లకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. మన్నె సతీష్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్, గీత, విష్ణు, వంశీ అనే ఏడుగురు ప్రస్తుతం సీసీఎస్ పోలీసుల నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. వారిని కస్టడీలోకి తీసుకున్నట్లుగానీ, అరెస్టు చేసినట్లుగానీ పోలీసులు చూపకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఆ ఏడుగురి కుటుంబ సభ్యుల తరఫున హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో దాఖలయ్యే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఢిల్లీ పోలీసుల అదుపులోకి వెళ్తే ఈ వ్యవహారం మరింత వేడెక్కుతుందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వీరెక్కడ ఉన్నారన్నది గోప్యంగానే ఉండిపోయింది.

అమిత్ షా ఫేక్ వీడియోకు సంబంధించి బీజేపీ స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి గత నెల 27న సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ పోలీసులు ఒకవైపు దర్యాప్తులో భాగంగా తెలంగాణకు వచ్చి నోటీసులు ఇవ్వడంతో ఏ క్షణమైనా వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీంతో వారి కంట్రోల్‌లోకి వెళ్ళకుండా రాష్ట్ర పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. ఒకవేళ ఢిల్లీ పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లయితే సైబర్ క్రైమ్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ (నెం. 1014/2024) ప్రకారం వారిని విచారిస్తున్నామని, అవసరమైతే అరెస్టు చేస్తామని చెప్పి ఇక్కడే ఉంచే అవకాశమున్నది. కేసు ఎంక్వయిరీలో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నామని వివరించి ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పకుండా తెలంగాణ పరిధిలోనే ఉంచాలన్నది ప్లాన్.

ఢిల్లీ పోలీసులు గత నెల 28న గాంధీభవన్‌కు వెళ్ళి కొద్దిమందికి నోటీసులు ఇచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి రామచంద్రారెడ్డిని కలిసి మాట్లాడి నలుగురు సోషల్ మీడియా సెల్ వారియర్లకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం పీసీసీ చీఫ్‌గా ఉన్నందున ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో మరికొద్దిమందికి నోటీసులు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు గ్రహించిన కాంగ్రెస్ లీడర్లు జాగ్రత్తపడి కొద్దిమంది సోషల్ వారియర్లను ఢిల్లీ పోలీసులకు అందుబాటులో లేకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా ఏడుగురి గురించి వార్తలు వస్తున్నట్లుగానే మరికొద్దిమంది కాంగ్రెస్ సోషల్ వారియర్లు సైతం త్వరలో రాష్ట్ర పోలీసుల అదుపులోకి వెళ్ళే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఒకే విడతలో మే 13న పోలింగ్ జరగనున్నందున అప్పటిలోగా మరికొద్దిమందికి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవాలని, విచారణకు తీసుకెళ్ళాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సైతం ఒక టీమ్ గాంధీభవన్‌కు వచ్చి ఎంక్వయిరీ చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన స్థానిక బేగంబజార్ పోలీసులు ఏ కారణంతో గాంధీభవన్‌కు వెళ్ళారంటూ వారిని ఆరా తీసినట్లు తెలిసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ తన విమర్శల వేడిని పెంచుతూ ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. పొలిటికల్ డిబేట్‌కు దారితీసింది. పోలింగ్ జరిగే లోపు అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులు, దాన్ని నివారించాలని రాష్ట్ర పోలీసులు భావిస్తుండడంతో ఏ రోజు ఏ టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.