దేశ స్వాతంత్ర్యం కోసం, స్వధర్మ రక్షణ కోసం ఎంతోమంది ఆదివాసి వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. చరిత్రలో అలాంటి వీరగాథ భగవాన్ బిర్సా ముండా జీవితం. జీవించింది కేవలం 25 సంవత్సరాలే అయినా తన జీవితంలో ఆదివాసీలను అత్యంత ప్రభావితం చేసిన వీరుడు బిర్సా ముండా.
వ నవాసులను సంస్కరించడానికి బిర్సా డేవిడ్ నుండి భగవాన్ బిర్సా ముండాగా అవతరించాడు. గ్రామాల్లో పర్యటిస్తూ వనవాసులలో స్వాతంత్ర్య కాంక్షను ప్రజ్వలింప చేశాడు. బిర్సా ముండా బోధనలకు ప్రజలు ఆకర్షితులై వేలాదిమంది శిష్యులుగా చేరారు. బిర్సా ముండా ‘మనదేశంలో మనదే రాజ్యం’ అని గర్జించాడు. బిర్సా ముండా ప్రబోధాలతో ఏర్పడినది ‘బిర్సాయియత్’. వనవాసులందరూ దీన్ని తమ మాతృధర్మంగా స్వీకరించారు.
వనవాసులలోని సంఘటితశక్తిని చూసి భయపడిన ఆంగ్ల ప్రభుత్వం బిర్సాముండాను రాత్రివేళ దొంగచాటుగా అరెస్టు చేసి అసత్య ఆరోపణలతో 1895 నవంబర్‌లో రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. హజారీబాగ్ జైలులో రెండేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించిన అనంతరం 1897 నవంబర్ 30న జైలు నుంచి విడుదలయ్యారు. జల్, జంగిల్, జమీన్ కోసం వనవాసులంతా సంఘటితంగా పోరాడాలని జైలులోనే ‘ఉల్ గులాన్’ అని నినదించాడు. ఉల్ గులాన్ అంటే తిరుగుబాటు, సంకల్పం, విప్లవం అని అర్థం. తన బిర్సాయియత్ అనుచరులతో చిన్నచిన్న దళాలను ఏర్పాటు చేసి ఆయుధ శిక్షణ ఇప్పించాడు.
ఉల్ గులాన్ ఉద్యమంలో తొలి అడుగుగా 1899 డిసెంబర్ 24న రాంచి నుండి చాయ్ బాసా వరకు విశాల క్షేత్రంలోని పోలీస్ చౌకీలపై, ఆంగ్లేయుల క్లబ్బులపై రాత్రిపూట బాణాల వర్షం కురిపించారు. యుద్ధం ప్రారంభమై పోలీసుల నుండి గుళ్ళ వర్షం కురుస్తోంది. ఆదివాసులు సంప్రదాయ బాణాల వర్షం కురిపించారు. ఆదివాసుల బాణాల తాకిడికి బ్రిటిష్ పోలీసులు హహాకారాలు చేస్తూ నేలకొరిగారు. ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. హోరాహోరీగా జరిగిన పోరాటంలో బిర్సా ముండా తీవ్రంగా గాయపడినా కూడా రక్తమోడుతూ పోరాటం కొనసాగించాడు.
వనవాసి వీరుల విజృంభణకు పోలీసులు పారిపోయారు. డోంబారి పోరాటం స్వతంత్ర భారత చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. ఓటమిని జీర్ణించుకోలేని బ్రిటిష్ ప్రభుత్వం బిర్సా ముండా ఆచూకీ కోసం ఆదివాసులను అకారణంగా జైల్లోపెట్టి చిత్రహింసలు చేశారు. చివరకు ఒక గ్రామంలో నిద్రిస్తున్న బిర్సా ముండాను అర్ధరాత్రి దొంగ చాటుగా బంధించి రాంచి సెల్యులర్ జైలులో నిర్బంధించారు. 1900వ సంవత్సరం జూన్ 9వ తేదీన 25 ఏళ్ల బిర్సా ముండా జైలులో విష ప్రయోగం జరగడంతో అనుమానాస్పదంగా దివంగతుడయ్యారు. అలా బ్రిటిష్ అధికారుల కుట్రకు ఆదివాసి ఉద్యమ కెరటం నేలకొరిగింది.
బిర్సా ముండా సాగించిన సాయుధ పోరాటం ఆంగ్ల ప్రభుత్వాన్ని గజగజలాడించింది. దానివల్ల వనవాసుల హక్కుల రక్షణ కోసం ఆంగ్ల ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తన 25 సంవత్సరాల జీవనయానంలో గిరిజనులలో అద్భుతమైన చైతన్యం, పోరాటాన్ని నిర్మాణం చేసిన భగవాన్ బిర్సా ముండా జన్మదినం నవంబర్ 15వ తేదీని ‘జన జాతి గౌరవ దివస్’గా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ భవనంలో ఆయన తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. తమ జీవితాలలో గొప్ప మార్పులు తీసుకువచ్చిన బిర్సా ముండాను గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా భావించి భగవాన్‌గా కొలుస్తారు. బిర్సా ముండా జీవితం భావితరాలకు ఆదర్శం.
































