సముద్రం నిశ్చలంగా ఉన్నప్పుడు అంతా ప్రశాంతంగానే ఉంటుంది. పైగా ప్రకృతి కూడా సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది. చూసేందుకు అత్యంత అందంగా ఉంటుంది.
కానీ ఒక్కసారి సముద్రానికి తిక్క రేగితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. తీర ప్రాంతాలను అలలు ముంచేస్తాయి. అవసరమైతే తీరప్రాంతాన్ని కోసివేస్తాయి. ఆ సమయంలో తీరప్రాంతాలలో ఉండే ప్రజలకు నరకం కనిపిస్తూ ఉంటుంది. చూస్తుండగానే సర్వం నీటిలో కలిసిపోతుంది. సముద్రతీర ప్రాంతాలలో నివసించే వారికి ప్రధానంగా చేపల వేటే ఉపాధి మార్గంగా ఉంటుంది. వేరే పని లేక.. ఇంకో పని రాక.. ఇతర ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టం లేక మత్స్యకారులు ఈ ప్రాంతంలో ఉంటుంటారు.
మనదేశంలో గుజరాత్ తర్వాత.. ఆ స్థాయిలో తీరరేఖను కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలు, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉంటాయి. సముద్ర అలలు వచ్చినప్పుడు.. సముద్రం ముందుకు దూసుకు వచ్చినప్పుడు ఈ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతుంటాయి. ఓ నివేదిక ప్రకారం అలలు ముందుకు వచ్చినప్పుడు తీర ప్రాంతాలలో 32 శాతం వరకు భూమి కోతకు గురవుతున్నట్టు తెలుస్తోంది. తీర ప్రాంతం కోతకు ఎక్కువగా గురయ్యే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. ప్రతి ఏడాది తుపాన్ లు, ఇతర విపత్తులు చోటు చేసుకున్నప్పుడు ఈ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారించారు. 2030 నాటికి ఏపీ సముద్ర తీర ప్రాంతాలను పర్యావరణ విపత్తుల నుంచి రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఐదు కిలోమీటర్ల వెడల్పు గల గ్రేట్ గ్రీన్ వాల్ ను నిర్మించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.
గ్రేట్ గ్రీన్ వాల్ అనేది జీవ వైవిధ్యాన్ని, వాతావరణ స్థితిస్థాపకతను, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. గ్రేట్ గ్రీన్ వాల్ ను జీవన పర్యావరణ కవచంగా చెబుతుంటారు. గ్రేట్ గ్రీన్ వాల్ వల్ల తీరప్రాంతాల్లో నివసించే దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రజలను రక్షించడానికి అవకాశం ఏర్పడుతుంది.. గ్రేట్ గ్రీన్ వాల్ అనేది షెల్టర్ బెల్ట్ తోటలు, లోతట్టు వృక్ష సంపద, ఇసుక దిబ్బల లాంటి బహుళ పొరల గ్రీన్ బఫర్ జోన్ ను కలిగి ఉంటుంది. ఈ తుఫాన్లు, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. తీర ప్రాంతాలను స్థిరీకరిస్తుంది. పర్యావరణానికి సంబంధించిన పర్యాటకం, స్థిరమైన మత్స్య సంపద వంటి వాటి ద్వారా జీవన ఉపాధిని పెంచుతుంది. సముద్ర మట్టం పెరగడం, తుఫాన్లు, అలలు, రకరకాల మార్పుల వల్ల తీర ప్రాంతాలలో తీవ్రంగా నష్టం ఏర్పడుతోంది. భవిష్యత్ కాలంలో సముద్రమట్టం కనుక పెరిగితే ఏపీలోని 282 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల లక్షల మంది ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని.. ఆర్థికంగా అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గ్రేట్ గ్రీన్ వాల్ మూడు భాగాలుగా
గ్రేట్ గ్రీన్ వాల్ మూడు భాగాలుగా ఉంటుంది. ఇందులో మొదటి “సముద్రపు అంచు”. ఇది టైడల్ శక్తిని గ్రహిస్తుంది. తుఫాను, పెనబంటి ప్రభావాలను తగ్గించే మడ అడవులను కలిగి ఉంటుంది. నది ముఖద్వారం ప్రాంతంలో షెల్టర్ బెల్టులు ఉంటాయి. ఇక మిగిలిన రెండు కాలువ కట్ట, రోడ్డు పక్కన ఉన్న అవెన్యూ తోటల ద్వారా రూపొందించిన విండ్ బ్రేక్ లు ఉంటాయి. ఇవి తీవ్ర మైన గాలులను నియంత్రిస్తాయి. వీటిని పర్యావరణ పరిభాషలో కమ్యూనిటీ బఫర్ అని పిలుస్తుంటారు. ఉపాధి, కాంపెన్సేటరి అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (CAMPA) , పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం, జిల్లా ఖనిజ నిధులు, అంతర్జాతీయ వాతావరణ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరించి గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ఏపీ ప్రభుత్వం ఈ ప్రణాళిక రూపొందించింది.
































