Darshan Case: రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ని శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో దర్శన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో జూన్ 11న దర్శన్‌తో పాటు అతను సహజీవనం చేస్తున్న సహనటి పవిత్ర గౌడను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో వీరిద్దరితో సహా 17 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ) ప్రసన్న కుమార్, జరుగుతున్న విచారణ గురించి కోర్టకు సమాచారం అందించారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎస్పీపీ శనివారం అభ్యర్థించలేదు. దీంతో నలుగురిని రెండువారాల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
దర్శన్‌తో రిలేషన్‌తో ఉన్న పవిత్ర గౌడ గురించి సోషల్ మీడియాలో 33 ఏళ్ల రేణుకాస్వామి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతోనే ఈ హత్య జరిగింది. చిత్రదుర్గకు చెందిన స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూర్ తీసుకువచ్చి, చిత్రహింసలు చేసి చంపేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. స్వామి మృతదేహంపై మొద్దుబారిన గాయాలు ఉన్నాయి. కర్రలతో కొడుతూ, కరెంట్ షాక్‌కి గురిచేసినట్లు నిర్ధారించారు. ఇదే కాకుండా వృషణాలపై బలంగా తన్నడంతో మరణించినట్లు తేలింది. దర్శన్ అభిమాన సంఘం సభ్యుడు రాఘవేంద్ర, దర్శన్‌తో కలిపిస్తానని చెబుతూ రేణుకాస్వామిని ఆర్ఆర్ నగర్‌లోని ఒక షెడ్డుకు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టారు.
స్వామి మరణించిన తర్వాత మృతదేహాన్ని పారేసేందుకు, సాక్ష్యాలు నాశనం చేసేందుకు దర్శన్ రూ. 30 లక్షలు చెల్లించినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. చిత్రహింసలు జరుగుతున్న సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడల చెప్పులు, సీసీటీవీ ఫుటేజ్ వంటి సాక్ష్యాలను పోలీసులు సేకరించారు.