రేవంత్ మంత్రివర్గంలోకి ఆ నలుగురు – కీలక శాఖల మార్పు..!!

తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రివర్గ విస్తరణ పైన ఫోకస్ చేసారు. కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉంది.


బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న సీనియర్లకు మంత్రివర్గంలోకి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. అదే విధంగా కీలక శాఖల్లో మార్పుల దిశగా రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు మందే మంత్రివర్గం లో మార్పులు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.

రేవంత్ కసరత్తు

ముఖ్యమంత్రి పాలనా – పార్టీ పరంగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. రేవంత్ ఈ సారి జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క సీటు దక్కలేదు. దీంతో..గ్రేటర్ ఎన్నికలకు ముందే పార్టీని బలోపేతం చేసే దిశగా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ముఖ్య నేతకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.

మంత్రివర్గ విస్తరణ

తాజాగా కాంగ్రెస్ లో చేరిన పోచారం పేరు మంత్రివర్గం రేసులో వినిపిస్తోంది. పోచారంకు మంత్రి పదవి దక్కితే నిజామాబాద్ నుంచి మరోకరికి మంత్రి పదవి ఉంటుందా లేదా అనేది చర్చగా మారింది. అదిలాబాద్ నుంచి గడ్డం వినోద్ కు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తాజాగా మంత్రి పదవి రేసులో ముందుకు వచ్చారు. ఆయన సోదరుడు మంత్రిగా ఉండటంతో..రాజగోపాల్ కు ఇప్పడే ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు.

ఛాన్స్ దక్కేదెవరికి

ముదిరాజ్ వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మహబూబ్ నగర్ కు చెందిన శ్రీహరి పేరు రేసులో ఉంది. ఇక..సీఎం వద్ద పలు కీలక శాఖలు ఉన్నాయి. విద్య, హోం, గనులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. దీంతో..కొత్తగా వచ్చే వారికి ఈ శాఖలు కేటాయిస్తారనే అంచనాలు ఉన్నా…ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరి శాఖల సర్దుబాటు ఉంటుందనే వాదన కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. పార్టీ హైకమాండ్ ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వటంతో వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ తన టీంలో తుది జాబితాలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.