Boiled Eggs: ఉడకబెట్టేటప్పుడు గుడ్లు పగిలిపోతున్నాయా? అయితే ఈ సింపుల్‌ టిప్స్ మీకోసమే..

Egg Benefits: గుడ్లు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుడ్లు చాలా ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే వైద్యులు కూడా రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినాలని సిఫార్సు చేస్తున్నారు.
ఇక చిన్న పిల్లలకు ఆహారంలో గుడ్లు కచ్చితంగా ఉండాల్సిందే. వీటిని తినడం వల్ల పిల్లలు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. మెదుడు కూడా బాగా పనిచేస్తుంది. ఫలితంగా వారు చదువులో మరింత చురుకుగా మారుతారు. చాలామంది గుడ్లను ఉడకబెట్టడం, ఆమ్లెట్లు ..ఇలా చాలా రూపాల్లో తీసుకుంటారు. ఇక చాలా ఇళ్లల్లో ప్రజలు అల్పాహారంలో గుడ్లు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి ఉడకబెట్టిన గుడ్లు మంచి ఛాయిస్‌. పైగా ఉడకబెట్టిన గుడ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చాలామంది గుడ్లు ఉడకబెట్టడంలో తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఫలితంగా అవి నీటిలోనే పగిలిపోతుంటాయి లేదా చెడిపోతుంటాయి. అయితే కొన్ని కిచెన్‌ ట్రిక్స్‌ పాటించడం ద్వారా గుడ్లు పగలకుండా చేయవచ్చు. మరి ఆ ఎఫెక్టివ్ కిచెన్ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం రండి.


పెద్ద పాత్రలో

మీరు రెండు గుడ్లు ఉడకబెట్టాలనుకుంటున్నారా, అయితే దీని కోసం పెద్ద పరిమాణపు పాత్రను ఎంచుకోండి. ఇలా చేయడం ద్వారా, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఒకదానికొకటి ఢీకొనవు. ఫలితంగా అవి పగిలిపోకుండా ఉంటాయి. అయితే కొందరు గ్యాస్ ఆదా చేయడానికి లేదా గుడ్లను త్వరగా ఉడకబెట్టడానికి చిన్న పరిమాణపు పాత్రలను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల గుడ్లు త్వరగా పగిలిపోతాయి.

నీటిలో ఉప్పు

గుడ్లు ఉడకబెట్టే నీటిలో మొదట్లో ఉప్పు వేయాలని చాలా తక్కువ మందికి తెలుసు. వాస్తవానికి, ఉప్పును జోడిస్తే వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇక ఉప్పునీటిలో గుడ్లను ఉడకబెట్టడం వల్ల వాటి పెంకులను తొలగించడం సులభమవుతుంది. చాలా సార్లు ప్రజలు గుడ్లను ఉడకబెట్టిన తర్వాత వాటి తొక్కలను సరిగ్గా తీయలేరు. దీన్ని నివారించడానికి, గుడ్లు ఉడకబెట్టే నీటిలో కాసింత ఉప్పును కలపాలి.

నేరుగా అలా చేయకుండా..

గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం సాధారణ విషయం. అయితే వాటిని నేరుగా ఉడకబెడితే పగిలిపోయే అవకాశం ఉంది. అందుకే ఫ్రిజ్‌ నుంచి గుడ్లను బయటకు తీసిన తర్వాత 10 లేదా 15 నిమిషాలు అలాగే వదిలివేయాలి. ఇలా చేయడం వల్ల వాటి ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలాగే ఎక్కువ సేపు మంటపై, పెద్ద మంటపై గుడ్లను ఉడకబెట్టకూడదు. ఎల్లప్పుడూ మీడియం మంటపైనే గుడ్లను ఉడకబెట్టాలి. దీంతో అవి పగిలిపోకుండా, బాగా ఉడకడానికి కూడా అవకాశం ఉంటుంది.