BRAGCET 2024: ఏపీ అంబేద్కర్ గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్- పూర్తి వివరాలివే..

www.mannamweb.com


ఏపీలో బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల్ విద్యాలయ సొసైటీ(APSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024-25 కోసం గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో పరీక్షల వివరాలు, దరఖాస్తుల స్వీకరణ, ఇతర వివరాలు ఉన్నాయి.
ఏపీలోని బీఆర్ అంబేద్కర్ గురుకులవిద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీని ప్రకారం ఈ రెండు తరగతుల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం జనవరి 25 నుంచిఫిబ్రవరి 23 వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం మార్చి 10న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
అంబేద్కర్ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ఆయా జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లలో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా ఐదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎస్సీ, ఎస్టీలు 10-11 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఓసీ, బీసీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లు(బీసీ-సీ) పదేళ్ల వయసు కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధి వరుసగా రెండేళ్ల పాటు అదే జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాలలో చదివి ఉండాలి. తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు మించకూడదు.
మార్చి 10న ఒకే రోజు రెండు సెషన్లలో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారు.
మార్చి 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య 5వ తరగతి ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. అలాగే
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం వీటి ఫలితాలను విడుదల చేసి మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. ఇందులో ఎంపికైన వారిని రాష్ట్రంలోని 185 అంబేద్కర్ గురుకులాల్లో ఆయా తరగతుల్లో చేరేందుకు వీలు ఉంటుంది. ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-సీలకు 12 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 2 శాతం సీట్లు కేటాయిస్తారు.