ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంస్థ క్వాలిటీ ఫిలిమ్స్ తెరకెక్కిస్తుంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
మళ్లీ రావా అనే సినిమాతో మొదలైన ఈ బ్యానర్ మంచి సినిమాలను అందించింది. కేవలం సినిమాలను మాత్రమే కాకుండా కొత్త దర్శకులను కూడా అందించింది. ఒక సందర్భంలో నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ నా బ్యానర్లో ఐదుగురు కొత్త దర్శకులను పరిచయం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న బ్రహ్మానందం సినిమా తో నాలుగవ దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆర్ వి ఎస్ నిఖిల్ దర్శకత్వంలో వచ్చిన “బ్రహ్మానందం”. హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ సంస్థ, నాలుగవ సినిమా ఫలితం ఏంటి.? ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తాపత్రయ పడుతుంటాడు బ్రహ్మా ఆనందం (రాజా గౌతమ్). ఉద్యోగం చేసుకుంటూ బ్రహ్మకు అన్ని విధాలుగా సహాయపడుతుంది తార ( ప్రియ వడ్లమాని). బ్రహ్మతో తన ప్రేమను కూడా పంచుకుంటుంది. డాక్టర్ గా ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా బ్రహ్మకు సహాయపడుతుంటాడు వెన్నెల కిషోర్. ఇక నటుడుగా నిలబడే ప్రయత్నంలో ఒక మంచి అవకాశం వస్తుంది. కానీ దాని కోసం దాదాపు ఆరు లక్షల వరకు డబ్బులు కావాల్సి ఉంటుంది. ఆ డబ్బుల కోసం బ్రహ్మ ఏం చేశాడు.? అనాధాశ్రమంలో ఉండే బ్రహ్మ తాతయ్య ఆనందరావు మూర్తి (బ్రహ్మానందం) తన సొంత ఊర్లో ఉన్న ఆరెకరాల భూమిని అమ్మి డబ్బులు ఇస్తానని చెప్పి తన ఊరికి తీసుకెళ్తాడు. అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత ఆనందరావు మూర్తి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి.? అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి.? అసలు సినిమా ఉద్దేశం ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా సినిమాలు చూడాల్సిందే.
విశ్లేషణ:
స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ లో రాహుల్ యాదవ్ నిర్మించిన సినిమా అంటేనే ఒక పాజిటివ్ బజ్ తో సినిమా ప్రేమికుడు థియేటర్లోకి అడుగు పెడతాడు. అయితే వాస్తవానికి ఈ సినిమాకి ఊహించినంత బజ్ లేదు. కేవలం రాహుల్ యాదవ్ గొప్ప సినిమాలను నిర్మిస్తాడు… అనే ఆలోచనతోనే వెళ్లిన ఆడియన్స్ కూడా ఉంటారు. ఈ సినిమా విషయానికొస్తే మొదటి 40 నిమిషాలు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత సినిమా పాయింట్ ను రివీల్ చేశాడు దర్శకుడు. పాయింట్ వినడానికి కొత్తగా అనిపించినా కూడా ఇది చెప్పడానికి సినిమా చేయాల్సిన అవసరం ఉందా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ సో సో కామెడీ వలన ఈ సినిమా సాఫీగా కొంతవరకు సాగిపోయింది.ఆ తర్వాత కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలో తన పాత్ర ఎమోషనల్ గా స్టార్ట్ అయిన కూడా మధ్య మధ్యలో బ్రహ్మానందం మార్క్ కామెడీ కనిపిస్తుంది. బ్రహ్మానందం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఆ స్థాయిలో కామెడీని పండించగలిగే నటుడు ఎవరు అంటే ఇప్పుడున్న వాళ్లలో వెన్నెల కిషోర్ పేరు ఖచ్చితంగా మొదట వినిపిస్తుంది. బహుశా దర్శకుడు అందుకే కావచ్చు ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్రకు మంచి స్కోప్ ఉండేలా ప్లాన్ చేశాడు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ ఫన్నీ సీన్స్ మధ్య గౌతమ్ తేలిపోయాడు. ఇద్దరు గౌతమ్ ని అన్నీ సీన్స్ లో డామినేట్ చేసేసారు.
రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో డెబ్యూ ఇచ్చాడు. అప్పటి నుంచి ఈయనకు పెద్దగా హిట్స్ లేవు. ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా నిలబడాలని తండ్రి బ్రహ్మానందం సాయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బ్రహ్మా ఆనందం మూవీ చేశాడు. అయితే ఇదే ఆయన చేసిన తప్పు అని అనుకోవచ్చు. సినిమా మొత్తంలో బ్రహ్మానందం, వెన్నల కిషోర్ లే కనిపించారే తప్పా… రాజా గౌతమ్ పెద్దగా కనిపించలేదు. ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య రాజా గౌతమ్ ఎంత మంచి ఫర్మమెన్స్ ఇచ్చినా… తేలిపోయాడు. వీళ్లు ఇద్దరు లేని సీన్స్‌లో మాత్రమే రాజా గౌతమ్ కనిపించాడు.
ఇక గౌతమ్ విషయానికి వస్తే కామెడీ టైమింగ్ బాగుంది. అయితే సినిమాలో రెండు చోట్ల మాత్రం ఎమోషనల్ సీన్స్ లో తనదైన బెస్ట్ ఇచ్చాడు గౌతమ్. ముఖ్యంగా ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే గౌతమ్ డాన్స్. జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీని అద్భుతంగా మ్యాచ్ చేశాడు. ఆడియన్స్ కి అది కొద్దిపాటి విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఉన్నంతలో చెల్లిగా నటించిన దివిజ ప్రభాకర్ పర్వాలేదు అనిపించింది. బాబాయ్ క్యారెక్టర్ లో కనిపించిన ప్రభాకర్ తన పరిధిలో బానే నటించాడు. రాజీవ్ కనకాల, సంపత్, భరణి తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సినిమాలో యాక్టర్స్ వేసుకున్న కాస్టూమ్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ క్రెడిట్ కచ్చితంగా మౌనిక యాదవ్ కి దక్కాలి. శాండిల్యా అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మంచి ప్లస్ అయింది. కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వర్కౌట్ అయింది.
ప్లస్ పాయింట్స్ :
బ్రహ్మానందం
వెన్నల కిషోర్
కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్‌లో సాగదీత
ఎడిటింగ్
కొన్ని పాత్రలను ఎక్కువ చూపించకపోవడం
కొన్ని సీన్స్‌కు జస్టిఫికేషన్ లేకపోవడం
లో ప్రొడక్షన్ వాల్యూస్
మొత్తంగా… ‘భ్రమ’నానందం