చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ రాజా ఒక కీలక పాత్ర పోషించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
రంగ మార్తాండలో తన అద్భుతమైన నటనతో అందరికీ కన్నీళ్లు తెప్పించారు నటుడు బ్రహ్మానందం. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన మళ్లీ బ్రహ్మా ఆనందం సినిమాతో మన ముందుకు వచ్చారు. గతనెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగానే అలరించింది. బ్రహ్మానందం యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పటిలాగే వెన్నెల కిశోర్ కూడా తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన బ్రహ్మ ఆనందం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం (మార్చి 19) నుంచి బ్రహ్మా ఆనందం సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీ గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. గురువారం (మార్చి 20) నుంచి ఆహా యూజర్స్ అందరికీ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పై రాహుల్ యాదవ్ నక్కా బ్రహ్మా ఆనందం సినిమాను నిర్మించారు. ఆర్వీఎస్ నిఖిల్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి, రఘు బాబు, ప్రభాకర్, దివిజా ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శాండిల్య పిసపాటి సంగీతం అందించారు. మరి థియేటర్లలో బ్రహ్మా ఆనందం సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి కడుపుబ్బా నవ్వుకోండి.