Brain Stroke Risk Factors : ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఇతరేతర అనారోగ్య సమస్యల కారణంగా అనేక ప్రాణాంతక వ్యాధుల బారినపడుతున్నారు. హార్ట్ అటాక్ మాదిరిగా సైలంట్ వచ్చే వాటిలో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. ఎప్పుడు వస్తుందో గుర్తించడం కష్టం. స్ట్రోక్ అనేది.. మెదడులో నిర్దిష్ట ప్రాంతానికి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల సంభవించవచ్చు. ఇది మెదడు కణాలకు హాని కలిగించవచ్చు. అడల్ట్ స్ట్రోక్స్ వస్తే మాత్రం మరణం లేదా శాశ్వత వైకల్యానికి దారితీస్తుంది. మెదడుకు తీవ్రహాని కలిగించే అవకాశం ఉంది.
స్ట్రోక్ తర్వాత దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, తీవ్రంగా ఆలోచించడం, కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది, దృశ్య సమస్యలు, నడవలేకపోవడం పక్షవాతం వంటివి జీవితాంతం బాధిస్తాయి. దీని కారణంగా కొన్ని శరీర భాగాలను కదిలించలేరు. కండరాల బలహీనతకు దారితీస్తుంది. భావోద్వేగాలను వ్యక్తీకరించలేరు. మింగడం, నమలడం కష్టంగా ఉంటుంది. సరిగా నిద్రపోలేరు. స్ట్రోక్ నివారించలేం.. కానీ, అదృష్టవశాత్తూ.. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఏయే మార్గాలను పాటించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి :
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. అధిక ఉప్పు, చక్కెర, కొవ్వులను నివారించండి. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు.
2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి :
రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి ఐదు సార్లు వ్యాయామం చేస్తుండాలి. తద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడంలో సాయపడుతుంది.
3. ఒత్తిడిని తగ్గించుకోండి :
స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ధ్యానం, డీప్ బ్రీతింగ్ లేదా యోగా వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. తద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.
4. ధూమపానం మానేయండి :
ధూమపానం రక్త నాళాలు దెబ్బతినడం, రక్తపోటును పెంచడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం మానేయడం చాలా మంచిది. లేదంటే.. అది మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
5. మద్యం వినియోగాన్ని తగ్గించండి :
అధిక ఆల్కహాల్ తీసుకోవడం రక్తపోటును పెంచుతుంది. అది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ తీసుకోవడాన్ని బాగా తగ్గించండి. లేదంటే పూర్తిగా మానేసిన ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించుకోండి.
6. బరువు అదుపులో ఉండాలి :
అధిక బరువు లేదా ఊబకాయం బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
7. రక్తపోటును నియంత్రించండి :
అధిక రక్తపోటు అనేది స్ట్రోక్‌కు ప్రధాన ప్రమాద కారకం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. నియంత్రణలో ఉంచడానికి మీ వైద్యుని కలిసి అవసరమైన జాగ్రత్తలు, చికిత్స తీసుకోండి.
8. మధుమేహాన్ని నియంత్రించండి :
మధుమేహం రక్తనాళాలకు నష్టం కలిగించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి.
9. తగినంత నిద్ర :
నిద్ర లేకపోవడం అధిక రక్తపోటు, ఊబకాయం, స్ట్రోక్‌కు ఇతర ప్రమాద కారకాలుగా చెప్పవచ్చు. ప్రతి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరమని గుర్తించుకోండి.
10. మానసికంగా చురుకుగా ఉండండి :
పజిల్స్ పూర్తి చేయడం లేదా చదవడం కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వంటి మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా ఒత్తిడిని తగ్గించి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతుంది.
ఈ మార్గాలను అనుసరించడం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి కీలక ప్రమాదాలను పరిష్కరించుకోవచ్చు. తద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా, మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెదడు పనితీరును మెరుగుపర్చవచ్చు. స్ట్రోక్ సమస్యను కూడా తగ్గించవచ్చు.