ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అధికార వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బిగ్ షాక్ తగిలింది. శిరోముండనం కేసులో విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఫిర్యాదుదారులను ప్రతివాదులుగా చేర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మే మొదటి వారానికి కోర్టు వాయిదా వేసింది. కాగా, దళిత యువకులకు శిరోముండనం కేసులో త్రిమూర్తులుతో పాటు మరో 8 మందికి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 16వ తేదీన విశాఖ కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో విశాఖ కోర్టు తీర్పును తోట త్రిమూర్తులు హైకోర్టులో సవాల్ చేశారు. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తోట త్రిమూర్తులు అభ్యర్థనను తోసిపుచ్చి.. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.