BRS ఢమాల్.. ఇండియా టీవీ ప్రీ-పోల్ సర్వేలో సంచలన విషయాలు..

www.mannamweb.com


తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితం కానున్నట్లు ఇండియా టీవీ ప్రీ-పోల్ సర్వేలో వెల్లడైంది.
గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఒక్క చోట కూడా గెలవదంటూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నా రెండు స్థానాలకు మించి సాధ్యం కాదని ఆ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపొందగా ఈసారి అది మూడు రెట్లు పెరిగి తొమ్మిదికి చేరుకుంటుందని తేలింది. బీజేపీ మాత్రం గతంలో నాలుగు స్థానాల్లో గెలవగా ఈసారి మరో స్థానంలో గెల్చుకుని ఐదుకు పరిమితమవుతుందని, మజ్లిస్ యథావిధిగా ఒక్క స్థానంలో గెలుస్తుందని బుధవారం వెల్లడించిన ప్రీ-పోల్ ఫలితాల్లో పేర్కొన్నది. గత నెల 1-30 తేదీల మధ్యలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు తేలినట్లు పేర్కొన్నది.

అసెంబ్లీ ఫలితాలే రిపీట్

కనీసంగా పన్నెండు స్థానాల్లో గెలుస్తామని, కానీ 14 చోట్ల గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులంతా 14 సీట్లలో గెలుపు ఖాయమని ఇటీవల వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం గతం కంటే సీట్లు రెట్టింపు దాటి డబుల్ డిజిట్ సాధిస్తామని, మోడీ ఇమేజ్ ఈసారి తెలంగాణలో ఊహకు అందని తీరులో ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నది. బీఆర్ఎస్ నిర్దిష్టంగా గెలిచే సీట్ల సంఖ్యను చెప్పకపోయినా గతంలో గెలిచినవాటికి కొంచెం అటూ ఇటుగా ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో భాగంగా తెలంగాణలోని ఫలితాలను కూడా వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్… లోక్‌సభ ఎన్నికల్లోనూ ఫ్రంట్ రన్నర్‌గానే నిలవనున్నది.

స్వల్పంగా మెరుగుపడనున్న బీజేపీ

కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోయినా ఆ పార్టీకి తొమ్మిది సీట్లు దక్కుతాయని ప్రజల అభిప్రాయం ప్రీ-పోల్ సర్వే రూపంలో వెల్లడైంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, ఆ పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేసిన తర్వాత, ప్రచారం హోరెత్తిన అనంతరం పార్టీల బలాబలాల్లో, ప్రజల అభిప్రాయంలో ఎలాంటి తేడాలు చోటుచేసుకుంటాయనేది రానున్న రోజుల్లో వెల్లడికానున్నది. ఐదేండ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ స్వల్పంగా మెరుగుపడినట్లు ఈ స్టడీలో తేలింది. కానీ కాంగ్రెస్ మాత్రం అనూహ్యంగా అతి ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా ఆవిర్భవించనున్నది. బీఆర్ఎస్ మాత్రం పదేండ్లు అధికారంలో ఉన్నా ఈసారి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అనేది తేలింది.

భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు

తెలంగాణ హక్కులను పార్లమెంటులో ప్రస్తావించేది, కేంద్రం మెడలు వంచి సాధించేది తమ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అభిప్రాయం మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ గొంతు చించుకుంటున్నా గతంకంటే ఒక్కటి మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశమున్నట్లు స్పష్టమైంది.