తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.. చంద్రబాబుతో BRS ఎమ్మెల్యేలు భేటీ
ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని బాబు నివాసంలో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారు.
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాంశాలు సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గతంలో టీడీపీలో పనిచేసినవారే. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెటిలర్స్ ఓట్లతో విజయం సాధించారన్న ప్రచారం జరిగింది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలంతా టీడీపీకి సానుభూతి పరులుగానే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో పనిచేసి పార్టీని వీడిన వారు మళ్లీ టీడీపీకి వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
టీడీపీ నేతలు సైతం కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని లీకులు ఇస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలువడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ చేస్తున్న లీకులకు ఎమ్మెల్యేల భేటీ బలం చేకూర్చినట్లయింది. అయితే పార్టీలో చేరుతారా..? లేదా..? అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. బాబును కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం మర్యాదపూర్వకంగానే కలిశామని పేర్కొంటున్నారు. ఏపీ సీఎంగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్నందుకు కలిసి శుభాకాంక్షలు తెలిపామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే మాండవ వెంకటేశ్వర్ రావు సైతం కలిసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం