Budget 2024: నో ట్యాక్స్‌ లిమిట్‌ రూ.8 లక్షలకు పెంపు..!?

www.mannamweb.com


రానున్న కేంద్ర బడ్జెట్‌ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నది మధ్యంతర బడ్జెట్‌ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్‌కు ఉన్నంత అంచనాలు ఈ సారి బడ్జెట్‌పై ఉన్నాయి.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

రూ.8 లక్షల వరకూ నో ట్యాక్స్‌!
ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్‌లో ఉండే లాంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్‌లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

 

సింగిల్ హైబ్రిడ్ స్కీమ్
వ్యక్తిగత ఆదాయపు పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలుపుకొని సరళీకృత “సింగిల్ హైబ్రిడ్ స్కీమ్”ని ఈ బడ్జెట్‌లో ప్రకటించవచ్చని
బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిటీ ఛైర్‌పర్సన్ వివేక్ జలాన్ అంచనా వేశారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు
మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్‌లో ఆశించవచ్చని ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (కలకత్తా చాప్టర్‌) చైర్‌పర్సన్‌ రాధికా దాల్మియా చెబుతున్నారు. రాష్ట్రీయ స్వస్థ్య​ బీమా యోజన భత్యం పెంపు, బాలికలకు విద్య ప్రయోజనాలను పెంచడం కీలకమైనని ఆమె పేర్కొన్నారు.