మీరు స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఇప్పుడు మీరు చౌకైన ధరలకు స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయొచ్చు.
2025 బడ్జెట్ ప్రకటనల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్‌ల ధరలపై పెద్ద ప్రకటన చేశారు.
ఇప్పుడు మీరు ఈ ఎలక్ట్రినిక్ డివైజ్‌లను మునుపటి కన్నా తక్కువ ధరలకు కొనుగోలు చేయొచ్చు. ఆర్థిక మంత్రి ప్రకటన ప్రకారం.. భారత మార్కెట్లో తయారయ్యే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు చౌకగా లభ్యం కానున్నాయి.
ఎంతగానో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ 2025 మరెన్నో తీపికబురులను మోసుకొచ్చింది. దేశీయంగా అనేక రంగాలకు మినహాయింపులను అందిస్తూ భారీగా ఊతమిచ్చింది. తాజా బడ్జెట్ ప్రకటనలతో టెక్ ప్రపంచంలో సందడిగా మారింది. ఈ బడ్జెట్ తయారీదారులు, కస్టమర్లకు శుభవార్త అందించింది. మీరు స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు లేదా ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు మీకు చౌకగా కొనుగోలు చేసేందుకు గొప్ప అవకాశం.
విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు :
అనేక పరికరాల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ప్రత్యక్ష ప్రయోజనం ఏమిటంటే.. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ మరింత చౌకగా మారబోతున్నాయి.
ప్రధానంగా మొబైల్ ఫోన్లపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా భారత మార్కెట్లో తయారయ్యే మొబైల్ ఫోన్ల ధర భారీగా తగ్గనుంది. దాంతో నేరుగా వినియోగదారులకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఇకపై వినియోగదారులు తక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొబైల్ కంపెనీలు దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. ఫలితంగా వినియోగదారులు అధిక ప్రయోజనాలను పొందడానికి వీలుంటుంది.
కస్టమ్ డ్యూటీ తగ్గింపు :
బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి మొబైల్ ఫోన్లపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం భారత్‌లో తయారయ్యే మొబైల్ ఫోన్‌ల ధరపై ఉంటుంది. కస్టమ్ డ్యూటీ తగ్గింపు కారణంగా, మొబైల్ ఫోన్‌ల ధరలు కూడా దిగివస్తాయి. ఇప్పుడు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి తక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది.
ఇటీవలి కాలంలో, బ్యాటరీ తయారీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బడ్జెట్‌లో లిథియం అయాన్ బ్యాటరీ తయారీదారులకు పెద్ద ఊరటనిచ్చింది. మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 అదనపు మూలధన వస్తువులను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. బడ్జెట్‌లో, ఈసీ బ్యాటరీ తయారీకి 35 అదనపు మూలధన వస్తువులను ప్రతిపాదించారు.
ఇది కాకుండా, ఎల్ఈడీ, ఎల్‌సీడీ LCD డిస్‌ప్లేలతో కూడిన స్మార్ట్ టీవీలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కంపెనీ ప్రతిపాదించింది. దీని ద్వారా కస్టమర్లు నేరుగా ప్రయోజనం పొందుతారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను ఇంటర్నెట్‌తో అనుసంధానించాలని కూడా ప్రతిపాదించారు.
స్థానిక తయారీ వల్ల కలిగే ప్రయోజనాలివే :
భారత్‌లో బ్యాటరీ తయారీపై దృష్టి సారిస్తున్నారు. లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసే దేశీయ తయారీదారులను ప్రోత్సాహం అందుతుంది. దీంతో దేశంలో మొబైల్ బ్యాటరీల తయారీ ఖర్చు తగ్గుతుంది. మొబైల్ ఫోన్‌లతో పాటు ఎల్‌ఈడీ-ఎల్‌సీడీ టీవీ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి. వీటిపై విధించే కస్టమ్ డ్యూటీని కూడా తగ్గించారు.
ఎలక్ట్రిక్ వాహనాలు (EV), స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ప్రభుత్వం ఈవీ బ్యాటరీల తయారీలో ఉపయోగించే 35 అదనపు వస్తువులను, మొబైల్ ఫోన్ బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే 28 అదనపు వస్తువులను మినహాయించిన మూలధన వస్తువుల జాబితాలో చేర్చింది. దాంతో బ్యాటరీ తయారీ కూడా చౌకగా మారనుంది.
ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఎలక్ట్రానిక్స్ లేదా స్మార్ట్‌ఫోన్‌ల తయారీ ఖర్చు తగ్గింది. అదేవిధంగా బ్యాటరీ ధర కూడా తగ్గింది. ఇప్పుడు ఈ వస్తువుల ధరలు వినియోగదారులకు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి అనమాట..