దేశంలో 76 రైల్వేస్టేషన్లకు బంపర్ ఆఫర్…! తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆరు

దేశవ్యాప్తంగా రైల్వేలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రపంచంలో భారతీయ రైల్వేలకు ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య కీలక మార్పులు చేస్తున్నాయి.


ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లను ప్రపంచ స్ధాయిలో అభివృద్ధి చేయటంతో పాటు వందే భారత్ వంటి కొత్త తరం రైళ్లను పట్టాలపై పరుగులు తీయించడం వంటి చర్యలున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఓ సదుపాయం సక్సెస్ కావడంతో దీన్ని 76 స్టేషన్లకు విస్తరించబోతున్నారు.

తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో పాసింజర్ హోల్డింగ్ ఏరియా పేరుతో ఓ ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో వారికి కాస్త ఊరట కల్పించేందుకు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా మరో 76 స్టేషన్లలో ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేసేందుకు వీలుగా రైల్వేశాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం తెలిపారు. దీంతో వివిధ జోన్ల పరిధిలో త్వరలోనే ఈ పాసింజర్ హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

2026లో పండుగల సీజన్ లోపే దేశంలోని ఎంపిక చేసిన 76 స్టేషన్లలో ఈ పాసింజర్ హోల్డింగ్ ఏరియాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సెంట్రల్ రైల్వే పరిధిలో 6 స్టేషన్లు, తూర్పు రైల్వే పరిధిలో 5, తూర్పు మధ్య రైల్వే పరిధిలో 6, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 3, ఉత్తర రైల్వే పరిధిలో 12, ఉత్తర మధ్య రైల్వే పరిధిలో 4, ఈశాన్య రైల్వే పరిధిలో 4, ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో 2, వాయువ్య రైల్వే పరిధిలో 5, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6, ఆగ్నేయ రైల్వే పరిధిలో 3, నైరుతి రైల్వే పరిధిలో 4, పశ్చిమ రైల్వే పరిధిలో 8, పశ్చిమ మధ్య రైల్వే పరిధిలో 3 స్టేషన్లు ఉన్నాయి.

ఇందులో దక్షిణ మధ్య రైల్వేపరిధిలో అంటే తెలుగు రాష్ట్రాల పరిధిలో ఆరు స్టేషన్లకు ఇలా పాసింజర్ హోల్డింగ్ ఏరియాల ఏర్పాటుకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లతో పాటు ఏపీలోని తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి స్టేషన్లు ఉన్నాయి. వీటిలో నాలుగు నెలల్లోనే ఈ పాసింజర్ హోల్డింగ్ ఏరియాల్ని ఏర్పాటు చేయబోతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.