ఏడాదికోసారి తమ ఉద్యోగులకు బోనస్‌లు, పారితోషికాలు ఇవ్వడం చాలా సర్వసాధారణం. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అద్భుతమైన బోనస్‌లు అందిస్తాయి. మరి కొన్ని కంపెనీలు అసాధారణమైన బహుమతులు, కానుకలు అందించిన సందర్భాలూ ఉన్నాయి.
ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయేలా భారీ కానుకలిచ్చిన సూరత్ డైమండ్ కంపెనీ గురించి విన్నాం. అలా తమ కంపెనీ విజయంలో భాగస్వామ్యులైన ఉద్యోగులను గుర్తిస్తాయి. గౌరవిస్తాయి. అయితే చైనాకు చెందిన ఒక క్రేన్ కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా.. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!
చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచింది. తమ కంపెనీ ఉద్యోగులకు వార్షిక బోనస్‌ను వైరైటీగా ప్రకటించింది. ఉద్యోగులందరికీ 70 కోట్లు రూపాయలను బోనస్‌గా ఆఫర్ చేసింది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసిన కంపెనీ, ఏ ఉద్యోగికి ఎంత మొత్తం లభిస్తుందో నిర్ణయించడానికి ఒక పోటీ పెట్టింది. తాను ప్రకటించిన బోనస్ మనీ రూ.70 కోట్లు ఒక టేబుల్‌పై పర్చింది. దీంట్లో ఉద్యోగులు 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత తీసుకోవచ్చని తెలిపింది. 60 నుంచి 70 మీటర్ల టేబుల్ పై ఈ మొత్తాన్ని ఉంచి, ఉద్యోగులను 30 బృందాలుగా విభజించింది. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే రావాల్సి ఉంటుంది. వీరిద్దరూ 15 నిమిషాల్లో ఎంత సొమ్ము లెక్కపెడతారో అంత మొత్తం ఆ టీంకు దక్కుతుందని ప్రకటించింది. దీంతో పోటీ మొదలైంది. చకచకా డబ్బులు లెక్కపెడుతూ ఉద్యోగులు నానా హైరానా పడ్డారు. అన్నట్టు ఏదైనా తప్పుగా లెక్కిస్తే… ఆ నగదును బోనస్ నుండి తీసివేస్తారు కూడా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023 జనవరిలోనూ ఇదే విధంగా హెనన్ మైన్ క్రేన్ సంస్థ వార్షిక టీం లంచ్‌లో తమ ఉద్యోగులకు రూ.70 కోట్లను ఇచ్చిదట.