ఆ మహీంద్రా కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.2.2 లక్షల వరకూ తగ్గింపు

www.mannamweb.com


భారతదేశంలో మహీంద్రా కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల మహీంద్రా కార్లు అమ్మకాల్లో ఎప్పకప్పుడు రికార్డులను సెట్ చేస్తూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని మోడల్స్ కార్లపై ఇటీవల మహీంద్రా కంపెనీ ఆఫర్లను ఇస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారు రిలీజ్ చేసి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా మహీంద్రా & మహీంద్రా ఆ కారుపై రూ. 2.2 లక్షల వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది. అయితే ఈ  తగ్గింపు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. రేంజ్ టాపింగ్ ఏఎక్స్-7 వేరియంట్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. మహీంద్రా ఏఎక్స్-7  శ్రేణి రూ. 21.44 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమైంది. ఇప్పుడు తగ్గింపుతో ఈ కారు ధర రూ. 19.69 లక్షలకు లభిస్తుంది. టాప్- స్పెక్స్‌తో వచ్చే ఏఎక్స్-7 లగ్జరీ ఏడబ్ల్యూడీ వేరియంట్ తగ్గింపు ధరతో రూ. 24.99 లక్షలు లభిస్తుంది. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

తాజాగా తగ్గింపులతో బెంగళూరులో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 టాప్-ఆఫ్-ది-లైన్ ఏఎక్స్-7 ఏడబ్ల్యూడీ డీజిల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 31.5 లక్షలుగా ఉంటే ఢిల్లీలో మైక్రో ఎస్‌యూవీ ధర 29.62గా ఉంది. ముంబైలో రూ.30.2 లక్షలు, చెన్నైలో రూ.31.5 లక్షలు, హైదరాబాద్‌లో ఈ ఎస్‌యూవీ తగ్గింపుల అనంతరం రూ.31 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే కోల్‌కత్తాలో రూ.27.87 లక్షలు, లక్నోలో 28.97 లక్షలు, జైపూర్లో రూ.29.92 లక్షలు, అహ్మదాబాద్‌లో రూ.28 లక్షలు, ఇండోర్‌లో రూ.30.87 లక్షలుగా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే టాప్-ఆఫ్-లైన్ ఏఎక్స్7 మోడల్ లెవెల్-1 ఏడీఏఎస్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం ట్విన్ డిజిటల్ స్క్రీన్లు, పనోరమిక్ సన్రూఫ్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసేలా డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

వెంటిలేటెడ్ సీట్లు, ఏడు ఎయిర్‌బ్యాగ్లు, లెథెరెట్ సీట్ అష్టోల్బరీ, 12 స్పీకర్లతో 3డీ సౌండ్ సిస్టమ్ వంటివి ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. 2.0-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ 200 హెచ్‌పీ శక్తిని, 380ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. గేర్బాక్స్ ఎంపికల విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఫీచర్లు ఆకట్టుకుంటాయి. మరో ఇంజిన్ విషయానికి వస్తే 2.2-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఇది రెండు స్టేట్స్ ఆఫ్ ట్యూన్‌తో వస్తుంది. పెట్రోల్ మాదిరిగానే, డీజిల్ ఇంజన్ కూడా 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వస్తుంది.