ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణించాలంటే కచ్చితంగా విమానాల్లో వెళ్లాల్సిందే. మరొక ప్రత్యామ్నాయం లేదు. కానీ సముద్ర తీర ప్రాంతం ఉండే దేశాలకు అయితే షిప్‌లలోనూ వెళ్లవచ్చు. గతంలో విమానాలు లేని సమయంలో పెద్ద పెద్ద ఓడల ద్వారానే రోజుల తరబడి ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేసేవారు. అయితే మీకు తెలుసా..? 1950లలో లండన్ నుంచి కోల్‌కతాకు బస్సులను నడిపారు. అవును నిజమే. మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1957లో ఆల్బర్ట్ ట్రావెల్స్ అనేక కంపెనీ వారు లండన్ నుంచి కోల్‌కతాకు, ఆస్ట్రేలియాకు బస్సులను నడిపారు. అయితే 1957వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన లండన్ నుంచి తొలిసారిగా కోల్‌కతాకు ఓ బస్సు బయల్దేరింది. అందులో 20 మంది ప్రయాణించారు. లండన్‌లోని విక్టోరియా కోచ్ స్టేషన్ వద్ద వారు ఆ బస్సు ఎక్కారు. టిక్కెట్ ధర అప్పట్లో 145 పౌండ్లు (దాదాపుగా రూ.13,644) ఉండేది. 5 రోజుల పాటు ఆ బస్సు ప్రయాణం చేసి లండన్ నుంచి కోల్‌కతాకు వచ్చింది. ఈ క్రమంలో ఆ రూట్‌లో అప్పట్లో మొత్తం 15 బస్సులను ఆల్బర్ట్ ట్రావెల్స్ కంపెనీ నడిపింది.
ఇక లండన్ నుంచి కోల్‌కతాకు వచ్చే బస్సులు లండన్, బెల్జియం, పశ్చిమ జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్గనిస్థాన్, వెస్ట్ పాకిస్థాన్ ల మీదుగా ఇండియాకు చేరుకునేవి. ఇండియాలో బస్సులు ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, బనారస్ మీదుగా ప్రయాణించి కోల్‌కతాకు చేరుకునేవి. అయితే అప్పట్లో తొలిసారిగా ఆ బస్సుల్లో ప్రయాణం చేసిన వారి ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు నిజమా, కాదా అని వెరిఫై చేస్తే.. అవి నిజమేనని తేలింది. కాగా త్వరలోనే మళ్లీ అదే తరహాలో లండన్ నుంచి కోల్‌కతాకు బస్సులను తిప్పుతారని ఇప్పుడు మళ్లీ ప్రచారం అవుతోంది. టిక్కెట్ ధర రూ.15 లక్షలు ఉంటుందని సమాచారం. మరి ఈ వార్తలు నిజం అవుతాయో, కావో చూడాలి.