గుండెపోటుకు బై బై..వందేళ్లు హాయ్‌హాయ్‌!

www.mannamweb.com


గుండెపోటుకు బై బై..వందేళ్లు హాయ్‌హాయ్‌!

హార్ట్‌ ఎటాక్‌లను దూరం చేసే సరికొత్త మందు భారత మార్కెట్లోకి

ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులోకి ఇన్‌క్లిసిరాన్‌

ఎల్‌డీఎల్‌ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందంటున్న వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: గుండెపోటు రాకుండా వందేళ్లు బతకాలనుకుంటున్నారా? హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికోసం సరికొత్త మందు మార్కెట్లోకి వచ్చింది. గుండెపోటు దరిచేరకుండా ఆ మందు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. దాని పేరే ఇన్‌క్లిసిరాన్‌.. అపోలో ఆస్పత్రి, నోవార్టిస్‌ సంయుక్తంగా ఓ మందును మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ మందుతో వందేళ్లు గుండెపోటు రాకుండా జీవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

హార్ట్‌ ఎటాక్‌లు డబుల్‌..
గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో భారీగా పెరుగుతోంది. హృద్రోగ సమస్యల కారణంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 20 శాతం మంది పురుషులు గుండెపోటుతో మరణిస్తుండగా 17 శాతం మంది మహిళలు అదే సమస్యతో చనిపోతున్నారు. గత 30 ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో పదేళ్ల ముందే గుండె సంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. యుక్తవయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల మరింతగా పెరి గింది. గుండెపోటుకు ఎన్నో కారణాలున్నా ప్రధానంగా తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్‌డీఎల్‌) కారణంగా ఎక్కువగా హార్ట్‌ఎటాక్స్‌ వస్తున్నాయి.

అసలేంటీ మందు..?
ఇన్‌క్లిసిరాన్‌ అనే మందు శరీరంలోని కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించేందుకు స్టాటిన్స్‌ అనే రకం మందులు ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉన్నా ఇన్‌క్లిసిరాన్‌ మాత్రం వాటికన్నా ఎన్నో రెట్లు ప్రభావవంతగా పనిచేస్తుందని అంటున్నారు. ఇంజెక్షన్‌ రూపంలో ఉండే ఈ మందును ఇన్సులిన్‌ మాదిరిగా వేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకోసారి తీసుకుంటే గుండెపోటు దరిచేరదని పేర్కొంటున్నారు.

ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా ఇన్‌క్లిసిరాన్‌ (సింథటిక్‌ ఎస్‌ఐ ఆర్‌ఎన్‌ఏ) కొవ్వులు తయారయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ప్లాస్మాలోని తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్‌డీఎల్‌)ను నియంత్రించే సెరిన్‌ ప్రోటీన్‌ అయిన ప్రోప్రోటీన్‌ కన్వర్టేజ్‌ సబి్టలిసిన్‌ కెక్సిన్‌-9 (పీసీఎస్‌కే9)కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పీసీఎస్‌కే9 మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏకు ఇది అతుక్కొని పీసీఎస్‌కే9 ప్రోటీన్‌ తయారుకాకుండా అడ్డుకుంటుంది. దీంతో ప్లాస్మాలో ఎల్‌డీఎల్‌ గణనీయంగా తగ్గి రక్తంలోని ఎల్‌డీఎల్‌ను కాలేయం గ్రహించేలా చేస్తుంది. తద్వారా హృద్రోగ సమస్యలు రాకుండా కాపాడుతుంది. 200 వరకు ఉన్న స్థాయి కూడా 40 వరకు తగ్గేంత ప్రభావవంతంగా ఈ మందు పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ మందు తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకమైన జీవన విధానాన్ని పాటించాలి. ఆల్కహాల్, సిగరెట్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మందు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ట్రై-గ్లిజరైడ్స్‌ ఉన్న వారిపై ఈ మందు అంతగా ప్రభావం చూపదు. – శ్రీనివాస్‌ కుమార్, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్‌

ఎవరెవరు వాడొచ్చు?
సాధారణంగా హృద్రోగ సమస్యలు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. కుటుంబంలో ఎవరికైనా హృద్రోగ సమస్యలు ఉన్న చరిత్ర ఉంటే వారందరూ తక్కువ వయసులోనే ఈ మందు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అధిక కొలెస్టరాల్‌తో బాధపడుతున్న వారు, 40 ఏళ్లు దాటిన వారు ఈ మందును తీసుకుంటే హార్ట్‌ఎటాక్‌ రాకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. గుండెలో స్టెంట్‌ వేయించుకున్న వారు కూడా ఈ ఇంజెక్షన్‌ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

అనుమతులు వచ్చాయా?
ఇప్పటికే ఈ మందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అనుమతులు మంజూరు చేయగా భారత్‌లో 6 నెలల కిందటే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) కార్యాలయం అనుమతులు ఇచి్చంది. దీంతో తాజాగా ఈ మందును మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

నేటి నుంచి హృద్రోగసమస్యలపై కాన్ఫరెన్స్‌
గుండె సమస్యలపై అవగాహన కోసం ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో ప్రీమియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ కాన్ఫరెన్స్‌ జరగనుంది. అపోలో హాస్పిటల్స్, అమెరికాలోని కార్డియోవ్యాస్కులర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌తో కలిసి ఫ్యాక్ట్స్‌ ఫౌండేషన్‌ ఈ సదస్సును నిర్వహించనుంది. గురువారం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. గుండె విఫలమైనప్పుడు ఉపయోగపడే కొత్త పరికరాల పాత్రపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టులు హాజరుకానున్నారు.