Lok Sabha Elections 2024: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. ఇప్పుడు ఈ టెక్నాలజీ (Artificial Intelligence in Elections) గురించే ప్రపంచం అంతటా చర్చ జరుగుతోంది. ప్రతి సెక్టార్‌లోనూ AI వినియోగం క్రమంగా పెరుగుతోంది. కంటెంట్ క్రియేట్ చేస్తే ChatGPT టూల్ నుంచి ఏకంగా ఓ మనిషిని పోలే మనిషిని తయారు చేయడం వరకూ అన్నీ సాధ్యమవుతున్నాయి ఈ టెక్నాలజీతో. ఈ మధ్య మీడియాలోనూ వాడకం పెరిగింది. AI యాంకర్‌లతో వార్తలు చదివిస్తున్నాయి పలు సంస్థలు. కొన్ని కంపెనీలైతే AI టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఆ మేరకు మానవ వనరుల్ని తగ్గించుకుంటున్నాయి. మనుషులతో చేయించుకునే పనులను టెక్నాలజీతోనే చేయిస్తున్నాయి. ఇలా జాబ్ మార్కెట్‌ని కుదిపేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. ఈ ఇంపాక్ట్ ఇక్కడితో ఆగేలా లేదు. మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (AI Impact on Lok Sabha Elections 2024) జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ఓ రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చైనా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. ఇప్పటికే సోషల్ మీడియా పెద్ద మాయావలయంగా మారిపోయింది. ఏది అబద్ధమో, ఏది నిజమో ఆలోచించకుండానే ఫార్వార్డ్, షేర్‌లు చేసేస్తున్నారు. ఈ కారణంగా ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. గతంలో ఈ వదంతుల వ్యాప్తితో చాలా మందిపై మూకదాడులు జరిగాయి.
AIతో వాయిస్ క్లోనింగ్..
ఇప్పుడీ సోషల్ మీడియా చాలదన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా తోడవుతోంది. ఈ సాంకేతికతతో ఓ అబద్ధాన్ని నిజం అని నమ్మించడం చాలా సులువు. డీప్‌ఫేక్ వీడియోలు ఈ మధ్య కాలంలో ఎంత అలజడి సృష్టించాయో చూశాం. సినీనటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఆందోళనకు గురి చేసింది. ఆ తరవాత మరెంతో మంది సెలబ్రిటీల వీడియోలు బయటకు వచ్చాయి. అప్పుడే అందరి దృష్టి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై పడింది. ఇప్పుడు ఎన్నికలనూ ప్రభావం చేయనుందన్న మైక్రోసాఫ్ట్ రిపోర్ట్ ఇంకాస్త ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. చైనా ఇక్కడి ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు AI సాంకేతికతని వినియోగిస్తోందనేది మైక్రోసాఫ్ట్ చెబుతున్న విషయం. డీప్‌ఫేక్ టెక్నాలజీతో మన ముఖానికి వేరే వాళ్లకి అతికించి…అది మనమే అని నమ్మించవచ్చు. ఇదొక్కటి చాలు ఎన్నికల్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయొచ్చో చెప్పడానికి. ఉదాహరణకు ఓ నియోజకవర్గం నుంచి నిలబడిన అభ్యర్థి వాయిస్‌ని క్లోనింగ్ చేయొచ్చు. ప్రత్యర్థిని బూతులు తిట్టినట్టు, ఇంకేదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు సృష్టించవచ్చు. ఇదంతా జరుగుతున్నట్టు ఆ అభ్యర్థికి కూడా తెలియదు. ఇంతలోనే సోషల్ మీడియాలో ఆ వాయిస్ క్లిప్‌లు వైరల్ అయిపోతాయి.
వీడియోలతో దుష్రచారం..
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాయిస్‌ని క్లోనింగ్ చేశారు. ఆ క్లిప్ వైరల్ అయింది. ఆ తరవాత అది ఫేక్ అనే తేలింది. అధ్యక్ష ఎన్నికల ముందు ఇలాంటివి చేయడం అక్కడి రాజకీయాల్లో అలజడి సృష్టించింది. ఒట్టి ఆడియోలే కాదు. ఏకంగా వీడియోలే క్రియేట్ చేసేయొచ్చు. ఓ అభ్యర్థి డీప్‌ఫేక్‌ని సృష్టించి ఎన్నికలని ప్రభావితం చేసేలా వీడియోలు విడుదల చేసేందుకూ అవకాశముంటుంది.
మరో ఆందోళనకర విషయం ఏంటంటే…AI అప్లికేషన్‌లు ఇప్పటికే ఎన్నో పుట్టుకొచ్చాయి. మైక్రో టార్గెటింగ్ ఓటర్స్ (Micro Targeted Voters) నుంచి వాళ్ల అభిప్రాయాల్ని ప్రభావితం (How AI Impacts Elections) చేసే అప్లికేషన్ల వరకూ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. మైక్రో టార్గెటింగ్ అంటే ఓటర్లందరినీ టార్గెట్‌గా పెట్టుకుని వాళ్లకి ఎన్నికలకు సంబంధించిన ఫేక్ కంటెంట్ చేరువయ్యేలా చూడడం. అంతే కాదు. ఆయా ఓటర్ల పూర్తి వివరాలు సంపాదించేస్తారు. ఆన్‌లైన్ యాక్టివిటీ ఎలా ఉందో చెక్ చేస్తారు. ఉదాహరణకు..సోషల్ మీడియాలో మీరో పార్టీ అకౌంట్‌ని ఫాలో అవుతున్నారనుకోండి..ఆ పార్టీకి వ్యతిరేకమైన కంటెంట్‌ని పదేపదే మీ న్యూస్‌ఫీడ్‌లో వచ్చేస్తుంది. అప్పటి వరకూ ఆ పార్టీపై ఉన్న అభిప్రాయం క్రమంగా మారిపోయేలా మానిప్యులేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ. వ్యతిరేకమైన కంటెంట్ మాత్రమే కాదు. పార్టీకి అనుకూలమైన కంటెంట్‌నీ ప్రచారం చేసుకునేందుకు వీలవుతుంది.
సైబర్ దాడుల ముప్పు..
గతంలో ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఫేస్‌బుక్ యూజర్స్‌కి సంబంధించిన డేటా అంతా బడా పొలిటికల్ కన్సల్టెన్సీలు కొనుగోలు చేస్తున్నాయని కొన్ని రిపోర్ట్‌లు వెల్లడించాయి. ఓటర్ల సైకాలజీ ఎలా ఉందో తెలుసుకోడానికి చాలా సంస్థలు ఫేస్‌బుక్‌నే వేదికగా మార్చుకుంటున్నాయని తేల్చి చెబుతున్నాయి. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇదే జరిగింది. ఫేస్‌బుక్ నుంచి తీసుకున్న డేటాని ఎన్నికల కోసం దుర్వినియోగం చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున వాదనలు వినిపించాయి. ఇప్పుడు భారత్‌లోనూ ఇదే డిబేట్ జరుగుతోంది. AI టెక్నాలజీతో ఫేక్ న్యూస్‌ని చాలా తొందరగా వ్యాప్తి చేయడానికి వీలుంటుంది. ఇదొక్కటి చాలు ఎన్నికల్ని ఇంపాక్ట్ చేయడానికి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్‌ని క్రియేట్ చేయడం, ఆర్టిఫిషియల్ ట్రెండ్స్‌ని సృష్టించడం లాంటివి సులువుగా చేయొచ్చు. ఇదొక్కటే కాదు. ఈ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు ఏకంగా ఎన్నికల ఇన్‌ఫ్రాపైనే దాడులు చేసే ప్రమాదముంది. అంటే…ఓటింగ్ మెషీన్‌లు, ఓటర్ డేటాబేస్‌లపై సైబర్ దాడులు జరిగే అవకాశముంది. పైగా రూమర్స్ వ్యాప్తి చేసి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడమూ సులభమే. AI Chatbots, వర్చువల్ అసిస్టెంట్స్‌తో సోషల్ మీడియాలో యూజర్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు సైబర్ నేరగాళ్లు. వీటికి తోడు AIతో ప్రాంతీయ భాషల్లోకి అనువదించే వెసులుబాటు వచ్చేసింది. ఏ భాషలో మాట్లాడినా వెంటనే అది స్థానిక భాషలోకి తర్జుమా అవుతుంది. వదంతులు వ్యాప్తి చేయడానికి ఇది ఇంకా సులువైన మార్గం.
ఆ రిపోర్ట్‌తో అలజడి..
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (World Economic Forum) ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టి వదంతుల వ్యాప్తి అనేది అతి పెద్ద రిస్క్ అని తేల్చి చెప్పింది. అందుకే ఫ్యాక్ట్‌చెకింగ్ చాలా కీలకం. ఈ విభాగం ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత గట్టిగా AI టెక్నాలజీ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చు. అయితే…ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే మేలు కూడా జరుగుతుంది. స్వయంగా ప్రభుత్వమే ఈ సాంకేతికతతో పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్స్‌ని పరిశీలించడం, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం లాంటివి చేయొచ్చు. 2021లో బిహార్ ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల సమయంలో ఇదే చేసింది. బూత్‌లలో కౌంటింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకోడానికి అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ని యాక్సెస్ చేయడానికి AI టెక్నాలజీని వినియోగించింది. ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన రిపోర్ట్ అలజడి రేపుతోంది.