గుడ్ న్యూస్.. ఇక నుంచి వారు ఫోన్‌పే ద్వారా కరెంట్ బిల్లులు కట్టొచ్చు

www.mannamweb.com


ఒకప్పుడు కరెంట్ బిల్లులు కట్టాలంటే రక్తాలు చిందించేవారు. 90స్ బ్యాచ్ ని అడిగితే ఈ విషయం చెప్తారు. కరెంట్ బిల్లులు కట్టాలంటే కరెంట్ ఆఫీసులకు, పంచాయితీ ఆఫీసులకో వెళ్లి గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడాలి. ఆ తర్వాత మీసేవ అందుబాటులోకి వచ్చింది. ఇది కొంచెం పర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు గడువు తేదీలోపు వీలు చూసుకుని వెళ్లి కట్టి వచ్చే సదుపాయం ఉండేది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వంటివి అందుబాటులోకి వచ్చాక ఇంట్లోనే కూర్చుని ఆన్ లైన్ లో బిల్ చెల్లించేవారు. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక మొత్తం పరిస్థితి మారిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ వచ్చాక అందరి పని సులువైపోయింది.

ఇంట్లోనే ఉండి క్షణాల్లో బిల్ పేమెంట్స్ చేసేస్తున్నారు. రెంటు, కరెంటు, ఫోన్ రీఛార్జులు, ఇంటర్నెట్ బిల్లులు ఇలా అన్ని రకాల బిల్లులను డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లించేస్తున్నారు. అయితే ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడానికి కుదరదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు గతంలో వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు జూలై 1న ఒక ప్రకటన చేశాయి. విద్యుత్ బిల్లుని చెల్లించడం కోసం ఉపయోగించే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సహా అన్ని మొబైల్ పేమెంట్ సేవలను నిలిపివేస్తున్నామని తెలిపాయి. అధికారిక వెబ్ సైట్ ద్వారా బిల్ పే చేయాలని తెలిపాయి.

ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. అయితే విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో కస్టమర్లు ఇబ్బందులకు గురయ్యారు. అప్పటివరకూ సులువైన ప్రక్రియకు అలవాటుపడిన వారు.. వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు ఇచ్చి ఇదంతా పెద్ద తలనొప్పిగా భావించారు. కొంతమందికైతే వెబ్ సైట్ గురించి తెలియక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఇబ్బందులను గుర్తించిన ఏపీసీపీడీసీఎల్.. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించవచ్చునని తెలిపింది. అయితే అధికారిక వెబ్ సైట్ లో వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.

‘వినియోగదారులు ఇప్పుడు వారి ఫోన్‌ పే యాప్, APCPDCL వినియోగదారు మొబైల్ యాప్ మరియు వెబ్‌ సైట్ ద్వారా వారి విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు’ అని తెలిపింది. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ లు అయితే ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. మరోవైపు ఫోన్ పే కూడా తెలంగాణ సదరన్, నార్తర్న్ పవర్ బిల్స్ చెల్లించవచ్చునని తెలిపింది. ఫోన్ పే యాప్ లోని యుటిలిటీస్ లో ఎలక్ట్రిసిటీ ఆప్షన్ లోకి వెళ్తే.. తెలంగాణ సదరన్ పవర్ ఎలక్ట్రిసిటీ బిల్స్, తెలంగాణ నార్తర్న్ పవర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ని ఫోన్ పేలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టం (బీబీపీఎస్) ద్వారా చెల్లించవచ్చునని చూపిస్తుంది. గూగుల్ పే ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.