అనారోగ్యానికి కేరాఫ్.. రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు

 ఖమ్మం రూరల్ పరిధిలో విచ్చలవిడిగా వెలుస్తున్న టిఫిన్ సెంటర్లపై అధికారుల పట్టింపు కరువైంది. ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్న వీరు..


ఏ మాత్రం క్వాలిటీ లేకుండా ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలను ఆస్పత్రి పాలు చేస్తున్నారు. ఓ వైపు హోటళ్లలో ఇదే విధమైన తంతు నెలకొనగా.. మరోవైపు రోడ్ సైడ్ ఏర్పాటు చేసిన మొబైల్ టిఫిన్ సెంటర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎలాంటి నాణ్యత లేకుండా పూర్తిగా నాసిరకమైన టిఫిన్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ రోడ్డు పక్కన విక్రయాలు చేస్తూ ఓ వైపు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ.. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూనే మరోవైపు ఆరోగ్యాలను పాడు చేస్తున్నారు.

ఓ మొబైల్ టిఫిన్ సెంటర్ ఘనకార్యం..

రెండు రోజుల క్రితం వరంగల్ క్రాస్ రోడ్డు పరిధిలోని ఓ పత్రిక కార్యాలయం ఎదుట మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేసిన ఓ యువకుడు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. టిఫిన్ చేసేటప్పుడే ఆ యువకుడు తిన్న బోండాలు పుల్లగా ఉన్నాయని, చట్నీ రెండు మూడు రోజుల క్రితం కావచ్చని సందేహం వెలిబుచ్చగా.. టిఫిన్ సెంటర్ నిర్వాహకులు కొట్టిపారేశారు. ఎప్పటి టిఫిన్లు అప్పుడే తయారు చేస్తామని, క్వాలిటీ మెయింటెన్ చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో నిజమేనని నమ్మిన యువకుడు టిఫిన్ చేసి వెళ్లాడు. ఉదయం టిఫిన్ చేసిన యువకుడు మధ్యాహ్నం విరేచనాలతో ఆస్పత్రిలో చేరాడు. ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యావని డాక్టర్ చెప్పడంతో ట్రీట్మెంట్ చేయించుకుని మూడు వేలు వదిలించుకుని రికవరీ అయ్యాడు.

నిల్వ ఉన్న పదార్థాలే అధికం..

టిఫిన్ సెంటర్ లో నిల్వ ఉన్న పదార్థాలతోనే టిఫిన్లు తయారు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం మిగిలిన వాటిని సాయంత్రం తయారుచేయడం, సాయంత్రం మిగిలిన వాటిని మరుసటి రోజు వాడటం తో టిఫిన్ చేసిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పులిచి, పాచిపోయిన చట్నీని వాడటమే కాదు.. ఎలాంటి క్వాలిటీ లేని నూనెలు వాడటంతో అవి తిన్నవారు ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ టిఫిన్ సెంటర్లను పట్టించుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు మిన్నకుండడం తో వీరి వ్యాపారానికి అడ్డే లేకుండా పోతుంది. చూస్తే చిన్న వ్యాపారే అనుకున్నా.. రోజుకు వేల రూపాయలు ఆర్జిస్తూ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

టిఫిన్ సెంటర్లు ఆరోగ్య నిబంధనలు పాటిస్తున్నారా అనే ప్రశ్నకు ఫుడ్​ తనిఖీ అధికారులే చెప్పాలి. టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రత ఉల్లంఘనలను తెలంగాణ ఆహార భద్రత కమీషనర్, టాస్క్ ఫోర్స్ బృందాలు గుర్తించిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ ఉల్లంఘనల కారణంగా ఆహార పరిశుభ్రత ప్రమాణాలు కొందరు సెంటర్లలో పాటించటం లేదు. ఇంకా, కొంతమంది టిఫిన్ సెంటర్ నిర్వాహకులు వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం, వంటనూనె ఫ్రెష్ గా ఉండకపోవటం వంటి ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ యాజమాన్యం ప్రకారం, టిఫిన్ సర్వీసులు ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ (FSSAI) లైసెన్స్ పొందడం, హైజిన్ ప్రమాణాలు పాటించడం, తాజా పదార్థాలను ఉపయోగించడం తప్పనిసరి. అయితే, పూర్తిస్థాయిలో ఈ నియమాలు అన్ని చోట్ల పాటించబడటం లేదని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు మరింత గట్టిగా పర్యవేక్షణ అవసరం సూచించిన ఫలితం శూన్యం. కాబట్టి, తెలంగాణలో టిఫిన్ సెంటర్లలో ఆరోగ్య నిబంధనలు పూర్తిగా పాటించకపోవడం ఇంకా సవాళ్లతో ఉండగా, మరింత పరిశుభ్రతా తనిఖీలు కఠిన నియంత్రణల ద్వారా ఇది మెరుగుపడుతుందని పలువురు తిండిప్రియులు అభిప్రాయపడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.